Ind-Pak War Apple Effect: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు ప్రముఖ తత్వవేత్త కార్ల్ మార్క్స్. నేటి కాలంలో యుద్ధాలకు దారితీస్తున్న ప్రధాన కారణం కూడా ఆర్థిక సంబంధాలే అంటున్నారు ఆర్థికవేత్తలు. కియోస్ థియరీ – బటర్ ఫ్లై ఎఫెక్ట్ ప్రకారం.. ఒక వ్యవస్థలో చిన్న మార్పులు కూడా కాలక్రమేణా పెద్ద మార్పులకు దారితీస్తాయి. ఇది వాతావరణం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, రెండు దేశాల మధ్య యుద్ధం కూడా కావచ్చు. ఇప్పుడు ఈ థియరీలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. పెహల్గావ్ ఉగ్రదాడి వంటి దారుణం జరుగుతుందని కానీ, అది భారత్-పాక్ మధ్య యుద్ధానికి దారి తీస్తుందని కానీ ఓ 20 రోజుల క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. కానీ ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులకు, అమెరికాలో ట్రంప్ టారిఫ్‌ల బాదుడుకు సంబంధం ఉందా అంటే.. కొందరు ఆర్థిక నిపుణులు చెప్తున్న థియరీ ఇదే. ట్రంప్ సుంకాల బాదుడుతో భారీగా ఎఫెక్ట్ అయిన చైనా.. తన స్వలాభం కోసం సృష్టించిన ఉపద్రవమే ప్రస్తుతం భారత్-పాక్ యుద్ధం అంటూ అనుమానిస్తున్నారు పలువురు ఆర్థిక నిపుణులు.
ఏప్రిల్ 22, పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు అకస్మాత్తుగా భారత్‌పై అకారణంగా విషం కక్కిన రోజు అది. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణాన్ని చూసి ఓర్వలేక దాయాది దేశం ఎప్పటిలాగే తన కుయుక్తులను అమలు చేసిందని ఇప్పటివరకూ విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే, దీని వెనక చైనా హస్తం ఉందని ఓ అమెరికా వ్యాపారవేత్త తాజాగా పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య సుంకాల విధింపు తరువాత భారత్ వాణిజ్యపరంగా తనకు పోటీగా మారిన తరుణంలో చైనా ప్రాంతీయ ఉద్రిక్తతల కుంపట్లు రాజేస్తోందని ఎక్స్ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ప్యాట్రిక్ బెట్ డేవిడ్. ఈ అమెరికన్ వ్యాపారవేత్త వెలిబుచ్చిన అభిప్రాయం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. “భారత్, పాక్ మధ్య ఈ టైంలో ఉద్రిక్తతలు రేగడం ఆసక్తికరం. యాపిల్ లాంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను భారత్‌కు మళ్లిస్తున్నామని ప్రకటించగానే భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది. అమెరికా విధించిన సుంకాలు చైనాను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వాణిజ్యం భారత్ వైపు మళ్లుతోంది. దీంతో, తనకు పోటీగా నిలవగలిగిన ఓకే ఒక దేశంలో చైనా ఉద్రిక్తతలను ఈ విధంగా ప్రోత్సహిస్తోంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
యాపిల్ సంస్థ తన ఐఫోన్ ఉత్పత్తిని భారత్‌కు మళ్లిస్తున్నట్టు ఇటీవల ప్రకటించడం వాణిజ్య ప్రపంచంలో సంచలనంగా మారింది. చైనా కేంద్రంగా ఉన్న గ్లోబల్ సప్లయ్ చైన్‌ను సమూలంగా మార్చివేసే సంఘటన ఇది. 2026 ఆర్థిక సంవత్సరంలో 40 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లు భారత్‌లో ఉత్పత్తి చేయించాలని యాపిల్ నిర్ణయించుకుంది. దీంతో, అమెరికాలో విక్రయించే ఐఫోన్లు అన్నీ దాదాపుగా భారత్‌లో తయారవుతాయి. యాపిల్‌కు చైనా సంస్థల అవసరం తగ్గిపోతుంది. ఈ విషయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇప్పటికే విస్పష్టమైన ప్రకటన చేశారు. భారత్‌లోని ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ కలిసి ఐఫోన్ తయారీ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు తెలిపారు.
యాపిల్ సప్లై నెట్‌వర్క్‌కు భారత్ ఇప్పటికే కీలకంగా మారింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ల ఉత్పత్తిలో భారత్ వాటా 18 నుంచి 20 శాతంగా ఉంది. ఈ ఏడాది చివరికి ఇది 30 శాతానికి చేరొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దేశీ తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం భారత్ వైపు పలు సంస్థలను మళ్లేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు వ్యాపార అనుకూల వాతావరణం, సుస్థిర ప్రభుత్వ విధానాల కారణంగా భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక ఐఫోన్ తయారీ పరికరాలను చైనా నుంచి భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న యాపిల్‌కు అక్కడి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
అయితే, యాపిల్ మాత్రం తన నిర్ణయంపై దృఢంగా ఉంది. సుంకాలతో తన ఉత్పత్తులకు రిస్క్ లేకుండా చూసుకోవడంతో పాటు భారత మార్కెట్‌పై మరింత పట్టు పెంచుకునేందుకు యాపిల్ డిసైడైపోయిందని నిపుణులు చెబుతున్నారు.