తమిళనాడులోని కరూర్ జిల్లా వేలాయుధంపాళయంలో నటుడు విజయ్ ఎన్నికల ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందిన విషయం పెద్ద కలకలాన్ని రేపింది. ఈ సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలను అరెస్ట్ చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సి.టి.ఆర్. నిర్మల్‌కుమార్, జిల్లా కార్యదర్శి మదియళగన్‌లపై ఇప్పటికే సమన్లు జారీ చేసినప్పటికీ, వారు విచారణకు హాజరుకాకపోవడంతో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ర్యాలీకి ముందు భద్రతా ఏర్పాట్లపై పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, నిర్వాహకులు వాటిని పట్టించుకోలేదని అధికారుల దర్యాప్తులో తేలింది. సభా ప్రాంగణానికి సమీపంలో వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయడం, ఒకేచోట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు గుమిగూడడం వంటివి ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరికలు ఇచ్చినా, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు, మరణాలకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవించడం వంటి పలు కీలక సెక్షన్లను చేర్చినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అరుణా జగదీశన్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని ఆదేశించారు.
అయితే, ఈ ఘటనను “రాజకీయ కుట్ర”గా అభివర్ణించిన విజయ్, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీలు కూడా ఈ దుర్ఘటనకు డీఎంకే ప్రభుత్వ వైఫల్యమే కారణమని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం న్యాయ విచారణ కొనసాగుతుండగా, పరారీలో ఉన్న టీవీకే నేతలను పట్టుకోవడంపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.