Chandrababu: విజయనగరం జిల్లా దత్తిలో జరిగిన సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “తాను 1995 సీఎంనని సహకరిస్తే సరే, లేకపోతే ఏం చేయాలో చేసి చూపిస్తాం” అంటూ వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అయన మాట్లాడుతూ, “ఫేక్ ప్రచారాలతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆడబిడ్డల రక్షణ, రాష్ట్రంలో శాంతి భద్రతలే మా ప్రాధాన్యత. ఎవరికైనా గంజాయి మత్తు ఉంటే మత్తు దింపేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలనుకునే వారందరికీ ఖబద్ధార్” అని స్పష్టం చేశారు.
అలాగే, ఉద్యోగులను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఉద్యోగులను మా ప్రభుత్వం బాగా చూసుకుంటుంది. కానీ పని చేయకపోతే మాత్రం అస్సలు సహించేది లేదు” అని ఆయన హెచ్చరించారు.
ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం. ఇప్పటికే 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అదనంగా హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా తీసుకొచ్చాం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.