Chandrababu: విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశానికి దిశా నిర్దేశం చేసే శక్తివంతమైన సంస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్సుగుడా (ఒడిశా) నుంచి వర్చువల్‌గా దేశవ్యాప్తంగా 97,500 టవర్లను ప్రారంభించారు. అనంతరం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని, బీఎస్ఎన్ఎల్ ప్రాధాన్యతను, టెక్నాలజీ మార్పుల దిశగా జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావించారు.
“2010లో 4జీ, 2020లో 5జీ వచ్చాయి.. 2030లో 6జీ రానుంది. ప్రతి పదేళ్లకో కొత్త టెక్నాలజీ ఆవిష్కరణ తప్పనిసరి. ఇవి ఎవరూ ఆపలేరు” అని ఆయన అన్నారు. ఫోన్ ఒక మల్టీపర్పస్ సాధనంగా మారిపోయిందని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 730 సర్వీసులు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ..
-
“మోదీ దూరదృష్టి కారణంగానే దేశానికి కొత్త సంస్కరణలు వచ్చాయి”
-
“కోవిడ్ సమయంలో భారతదేశం వందకు పైగా దేశాలకు వ్యాక్సిన్ అందించింది. ఇది గర్వించదగ్గ ఘనత”
-
“ఒకప్పుడు లైటింగ్ కాల్ బుక్ చేస్తే వారం రోజులు పడేది. కానీ ఇప్పుడు టెక్నాలజీతో క్షణాల్లోనే సంభాషణ సాధ్యం అవుతోంది” అని అన్నారు.
ఇది కూడా చదవండి: BRS: బీఆర్ఎస్ ఎన్నికల వార్ షురూ.. కాంగ్రెస్ బాకీ కార్డుల విడుదల
అమరావతి భవిష్యత్తులో టెక్నాలజీ కేంద్రంగా మారనుందని సీఎం స్పష్టం చేశారు. “దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్ వ్యాలీ కూడా అమరావతిలోనే ఏర్పాటు అవుతుంది” అని వెల్లడించారు.
2047 నాటికి కార్పొరేట్ సేవల్లో గానీ, పబ్లిక్ సర్వీస్‌లో గానీ భారతదేశం నెంబర్ వన్ దేశంగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, టెక్నాలజీని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.