CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా జీవితంలో మరో అసాధారణ మైలురాయిని చేరుకున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం, బలమైన పునాది లేకుండా తిరుపతికి సమీపంలోని ఒక చిన్న గ్రామం నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన, ముఖ్యమంత్రి హోదాలో ఏకంగా 15 సంవత్సరాల అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. 1995, సెప్టెంబర్ 1న ఆయన సీఎంగా పగ్గాలు చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ఆయన పదవీకాలాన్ని లెక్కిస్తే… ముఖ్యమంత్రిగా ఆయన 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అసాధారణ నేతగా నిలిచారు.
దక్షిణాదిలో కొందరికే ఈ ఘనత:
దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలు చాలా మంది ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఘనత సాధించిన నాయకులు అతి కొద్ది మంది మాత్రమే. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి (దాదాపు 19 ఏళ్లు), పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి (16 ఏళ్లకు పైగా) తర్వాత, దక్షిణ భారతదేశంలో 15 ఏళ్ల రికార్డును అధిగమించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే కావడం విశేషం. ఎంజీ రామచంద్రన్, జయలలిత, రామకృష్ణ హెగ్డే వంటి ప్రముఖులు కూడా తమ రాజకీయ జీవితంలో ఈ మార్కును చేరుకోలేకపోయారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలోనే ఉంది. ఆయన ఉమ్మడి ఏపీకి 8 ఏళ్ల 255 రోజులు సీఎంగా సేవలందించారు. ప్రస్తుతం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఆయన పదవీకాలం ఆరేళ్లా 110 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తంగా ఈ రెండు కాలాలను కలిపితే 15 ఏళ్ల మార్కును దాటారు.
Also Read: Pawan Kalyan: మీకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా
విజన్‌తో కూడిన సంస్కరణలు:
చంద్రబాబు నాయుడు పాలనా విధానం ఎప్పుడూ దూరదృష్టితో కూడిన సంస్కరణల చుట్టూ తిరుగుతుంది. సింగపూర్ వ్యవస్థాపక ప్రధాని లీ క్వాన్ యూ పాలన స్ఫూర్తితోనే ఆయన విజన్-2020, విజన్-2047 వంటి లక్ష్యాలను రూపొందించారు. ఆయన తీసుకునే నిర్ణయాలు మొదట్లో వ్యతిరేకతను ఎదుర్కొన్నా, వాటి ఫలితాలు భవిష్యత్తు తరాలకు మేలు చేస్తాయని పదేపదే నిరూపితమైంది.
హైదరాబాద్ ఐటీ రంగానికి ఊపిరి పోసిన హైటెక్ సిటీ నిర్మాణం, లక్షల మందికి ఉపాధి కల్పించడం ఇందులో ప్రధానం.
ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం ద్వారా నేడు తెలుగు రాష్ట్రాల్లో ఇంటికో ఇంజనీరు ఉండే పరిస్థితికి పునాది వేశారు. 1999లో చేపట్టిన విద్యుత్తు సంస్కరణలు అప్పట్లో రాజకీయంగా పార్టీకి నష్టం కలిగించినా, నేడు కోతలు లేని విద్యుత్ సరఫరాకు దారి తీశాయి. నదుల అనుసంధానం చేపట్టి, గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపారు. అమరావతి రూపంలో ఒక బృహత్తర నగరాన్ని నిర్మించాలనే గొప్ప కల ఆయన విజన్‌కు నిదర్శనం.
సంక్షోభాల నుంచి విజయం వైపు ప్రస్థానం:
చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం సంక్షోభాలు, సంస్కరణల పంథాలో సాగింది. 2004 ఎన్నికల్లో ఓటమి తర్వాత పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నా, పార్టీని పదిలంగా కాపాడుకున్నారు. 2014లో విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా గెలిచి, తిరిగి అధికారం చేపట్టారు. 2019లో అధికారానికి దూరమైన తర్వాత, కనీవినీ ఎరుగని నిర్బంధాన్ని, అరెస్టును సైతం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, ఆ సంక్షోభాన్ని అధిగమించి, 2024లో భారీ మెజార్టీతో కూటమితో కలిసి తిరిగి అధికారంలోకి రావడం ఆయన అసామాన్య పోరాట పటిమకు నిదర్శనం. ప్రజలకు సంపద సృష్టించడం, సంక్షేమం అమలు చేయడమే లక్ష్యంగా ఆయన పాలన కొనసాగుతోంది.