Chandrababu

Chandrababu: విశాఖ సదస్సుపై కేంద్ర ఆర్థికమంత్రితో చర్చించిన సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహంపై చర్చలు జరుపుతున్నారు.

మొదటగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సాయం అందించాలని ఆమెను కోరారు. ఈ పథకం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేయవచ్చని ఆయన వివరించారు. ఇప్పటికే కేంద్రం ఈ పథకాన్ని ఐదు రాష్ట్రాలకు అమలు చేయాలని గత బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో సహకరించాలని ఆయన నిర్మలా సీతారామన్‌ను కోరగా, ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల అంశంపై ఆయనతో చర్చించారు. రాష్ట్రంలో సాగునీటి వనరుల విస్తరణ, నీటి ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్రం సహకరించాలని ఆయన అభ్యర్థించారు.

ఇది కూడా చదవండి: V C Sajjanar: ‘ఆడపిల్లల జోలికి వస్తే చుక్కలు చూపిస్తా’.. సజ్జనార్ వార్నింగ్

ఇక నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే ప్రతిష్ఠాత్మక పెట్టుబడుల సదస్సు (RISING AP) గురించి కూడా ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించారు. “రైజింగ్ ఏపీ” థీమ్‌తో జరగనున్న ఈ సదస్సు ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని వివరించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు.

అలాగే రాష్ట్రంలో అమలవుతున్న అంత్యోదయ సంక్షేమ పథకాల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి–సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు.

ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *