MSME Park: రాష్ట్ర పరిశ్రమల రంగాన్ని ముమ్మరంగా అభివృద్ధి చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేసారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, గురువారం ఆయన వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 11 ఎంఎస్ఎంఈ పార్కులు, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)ను ప్రారంభించనున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నారంపేట వద్ద ఈ ప్రత్యేక కార్యక్రమం జరుగనుంది.
ఈ పార్కులు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు(నారంపేట), దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాలతోపాటు, యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లిలో అభివృద్ధి చేశారు. మొత్తం 909 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.199 కోట్లు వెచ్చించింది.
ఈ పార్కుల్లో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ వంటి సమగ్ర మౌలిక వసతులను సిద్ధం చేయడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. వీటితో పాటు, త్వరలోనే మరో 25 ఎంఎస్ఎంఈ పార్కులు మరియు 14 ఎఫ్ఎఫ్సీలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Ind-Pak: పాకిస్తాన్ కు మరో షాక్..ఫ్లైట్స్ ఎంట్రీకి నో
2028 నాటికి రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తొలిదశలో 40 నియోజకవర్గాల్లో పార్కులను అందుబాటులోకి తీసుకురావడానికి కార్యాచరణ చేపట్టింది.
ముఖ్యంగా SME రంగంలో పెట్టుబడులను ఆకర్షించడంలో, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించడంలో, మరియు స్థానిక స్థాయిలో ఉద్యోగ అవకాశాలను పెంచడంలో ఈ పార్కులు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ కార్యక్రమం రాష్ట్ర పరిశ్రమల రంగాన్ని నూతన గమ్యానికి తీసుకెళ్లే మార్గదర్శకంగా నిలవనుందని పరిశ్రమల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

