Chandrababu : గతంలో ఏ ప్రధాని కూడా నదుల అనుసంధానంపై ఇంత చొరవ చూపలేదని సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి మోదీని ప్రశంసించారు. నదుల అనుసంధానం తమ ముఖ్య లక్ష్యంగా ఉందని, దీని కోసం కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరమని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఎదుగుతుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా డబుల్ డిజిట్ వృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి పనిచేస్తే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, ఆర్థిక అసమానతలను తగ్గించేలా ప్రణాళికలు రూపొందించవచ్చని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అరకు బ్రాండ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి ప్రధానమంత్రి మోదీ ప్రయత్నాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. గూగుల్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమవుతున్న సందర్భంలో, తాను మోదీని కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో టాక్స్ విధానాల గురించి మోదీతో చర్చించినట్లు వివరించారు. భవిష్యత్తులో టాక్స్ పాలసీలు మారితే పెట్టుబడులపై ప్రభావం ఎలా ఉంటుందో మోదీని ప్రశ్నించానని, అలాంటి ఆలోచనలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటే దేశానికి పెట్టుబడులు రాబట్టడం సాధ్యమవుతుందని మోదీ స్పష్టంగా చెప్పారని తెలిపారు.