Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, రాష్ట్ర ప్రజల ఆశయాలకు మద్దతు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కలపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు.
గుంటూరు-బీబీనగర్, గుత్తి-పెండేకల్లు రైల్వే డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు పునాదిరాయి వేసి, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, రవాణా రంగాలను మేల్కొల్పి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దోహదం చేస్తాయని ఆయన వివరించారు.
ఇప్పటికే విశాఖ సిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుందన్నారు. దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు పునాదిరాయి వేశామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వేజోన్ కీలకం కానుందన్నారు. రైల్వేజోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందన్నారు. రైల్వేజోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే ఏడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కిపైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ జరుగుతున్నాయని.. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధి సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. విశాఖతీరం, వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని తెలిపారు. విశాఖలోని హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పని చేస్తున్నామన్నారు.