Chaganti Koteswara Rao: వేదపండితులు, ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. విద్యార్థుల్లో విలువలు, నైతికత పెంచేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును క్యాబినెట్ హోదాతో పదవి ఇచ్చారు. కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో కోటేశ్వరరావుకు ఈ కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రభుత్వం విద్యార్థులలో నైతిక విలువలు పెంచడం విషయంలో ఎంత సీరియస్ గా ఉందనే విషయం అర్ధం అవుతోంది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా అవకాశం కల్పించింది. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2016లో చాగంటి ఈ పదవి ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్ళీ చాగంటి పదవి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి విద్యార్థులకు సంబంధించిన విషయంలో క్యాబినెట్ ర్యాంక్ సలహాదారు పదవిని ఇవ్వడంతో చాగంటి కోటేశ్వరరావుపై పెద్ద బాధ్యత పెట్టినట్టు అయింది.
చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కర్తగా లక్షలాది మంది ప్రజలను ఇన్స్ పైర్ చేస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు.. చాగంటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో పలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రసంగాల్లో విద్యార్థులకు విలువలు బోధించడంతో పాటు పరీక్షలకు సిద్ధం అవడం కోసం ఎలా తమ ప్రణాళికలను తయారు చేసుకోవాలి? పరీక్షలలో విజయం సాధించడానికి ఎటువంటి ప్రిపరేషన్ ఉండాలి వంటి అంశాలపై పలు ప్రసంగాలు చేశారు. ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియమితులు కావడంతో రేపటి తరానికి మరింత ప్రకాశవంతమైన జీవనశైలి అలవాటు చేసుకునే దిశలో ప్రభుత్వం పెద్ద అడుగు వేసినట్టు భావించవచ్చు.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గురించి మరిన్ని వివరాలు ఇవే..
చాగంటి కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, ఏలూరులో చాగంటి సుందర శివరావు, చాగంటి సుశీలమ్మ దంపతులకు 1959 జూలై 14న జన్మించారు. ఆయన తండ్రి హిందూ ధర్మాన్ని అనుసరించేవారు. ఏలూరులో తన విద్యార్థి రోజుల్లో ఆయన ప్రాచీన భారతీయ జ్ఞానంపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో పాల్గొనేవారు. అతను సుబ్రహ్మణ్యేశ్వరితో ఆయన వివాహం అయింది. ఆమె వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. చాగంటి దంపతులకు ఇద్దరు పిల్లలు షణ్ముఖ చరణ్, నాగవల్లి ఉన్నారు. ఇద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. ఆయన కాకినాడలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఆగస్టు 2018లో అయన పదవీ విరమణ చేశారు.
చాగంటి కోటేశ్వరరావు భాగవతం , రామాయణం , మహాభారతంతో పాటుగా వివిధ పురాణాల నుంచి రకరకాల హిందూ ఇతిహాసాలపై క్రమం తప్పకుండా మతపరమైన ఉపన్యాసాలు ఇస్తూ వస్తున్నారు. ఇవి వివిధ రేడియో, టీవీ ఛానెల్‌లలో ప్రసారం అవుతున్నాయి. కొన్ని భక్తి టీవీ ఛానెల్స్ ఆయన ప్రసంగాలను ప్రసారం చేయడానికి ప్రత్యేక స్లాట్‌లను కేటాయించాయి. ఆయన తన ప్రయాణ ఖర్చులు తప్ప ఉపన్యాసాన్ని అందించినందుకు ఎటువంటి పారితోషికాన్నితీసుకోరు. కాకినాడలో స్థిరపడిన ఆయన అక్కడ గోశాల నిర్వహిస్తున్నారు. ఆయన ఉపన్యాసాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు తప్ప.. నిత్యం గోశాలలో గోవులకు సేవ చేస్తూ ఉంటారు. అక్కడే ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తూ ఉంటారు.
ఉపన్యాసాలను అందించడంలో ఆయనకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 42 రోజుల్లో రామాయణం, 42 రోజుల్లో భాగవతం, 30 రోజుల్లో శివపురాణం , 2-3 నెలల్లో శ్రీ లలితా సహస్ర నామం పూర్తి చేసిన ఘనులు చాగంటి కోటేశ్వరరావు. ఆయనకు ప్రవచన చక్రవర్తి ( ఉపన్యాసాల చక్రవర్తి , శారద జ్ఞాన పుత్ర ( జ్ఞాన సరస్వతీ దేవి కుమారుడు ) వంటి బిరుదులు ఇచ్చి ఆయన గొప్పతనానికి గౌరవం కల్పించారు. అదేవిధంగా 2015లో రామినేని ఫౌండేషన్, USA ప్రత్యేక గౌరవ సత్కారం చేసింది. అలాగే, 2016లో డాక్టర్ పిన్నమనేని – సీతాదేవి ఫౌండేషన్ అవార్డు ఇచ్చి గౌరవించింది.