Medicines Price Cut: దేశ ప్రజలకు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 35 రకాల నిత్యావసర మందుల రిటైల్ ధరలను తగ్గిస్తున్నట్లు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నిర్ణయం వల్ల మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, నొప్పి నివారణ, యాంటీబయాటిక్ వంటి కీలక మందుల ధరలు గణనీయంగా తగ్గుతాయి.
యేసిలోఫెనాక్, పారాసెటమాల్, ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్, అమోక్సిసిలిన్-పొటాషియం క్లావ్యులానేట్, అటోర్వాస్టాటిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ వంటి మందులున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ విక్రయించే యేసిలోఫెనాక్-పారాసెటమాల్-ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ మాత్ర ధరను రూ.13గా నిర్ణయించింది. క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ విక్రయించే అదే ఫార్ములేషన్ ధరను 15.01గా పేర్కొంది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: సీఎం రేవంత్ ను కలిసిన చిరంజీవి
గుండె సంబంధిత వ్యాధులున్న వారు విస్తృతంగా వాడే మెడిసిన్ అయిన అటోర్వాస్టాటిన్ 40 mg + క్లోపీడొగ్రెల్ 75 mg మాత్రల ధరలను రూ.25.61గా నిర్ణయించింది. చిన్నపిల్లలకు ఉపయోగించే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్స్, విటామిన్ డీ లోపం ఉన్న వారిలో వాడే కోలికాల్సిఫెరాల్ డ్రాప్స్, డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ధర రూ.31.77కి తగ్గించింది.
NPPA జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చిరు వ్యాపారులు, డీలర్లు తమ దుకాణాల్లో ఈ కొత్త ధరల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలి. నిర్దేశించిన ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని NPPA హెచ్చరించింది. ఈ కొత్త ధరలకు వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అదనంగా ఉంటుందని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.