Caste Census

Caste Census: వచ్చే నెల 6 నుంచి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే…

Caste Census: నవంబర్ ఆరు నుంచి రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఆస్తుల నుంచి మొదలుకుని అప్పుల వరకూ, తినే తిండి దగ్గర్నుంచి వాడే వాహనాల దాకా, వ్యక్తులు అనుభవించే పదవులు, హోదాల వరకూ అన్నింటినీ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పౌరుల ఆరోగ్య సమస్యలు, వారికున్న సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులను సైతం అందులో విధిగా పొందుపరచాలని సూచించింది. ఆ మేరకు మొత్తం 75 ప్రశ్నలతో ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన’ను సర్కార్‌ చేపట్టబోతోంది. సంబంధిత ఫార్మాట్‌ను రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇప్పటికే రూపొందించింది. మొత్తం 75 ప్రశ్నలతో కూడిన ఏడు పేజీలను నమూనాగా ప్రచురించింది. ఈ ఫార్మాట్‌లో ఆస్తులతోపాటు రిజర్వేషన్ల ద్వారా పొందిన ఉద్యోగాలు, పదవులు, ఇతర హోదాలను కూడా పొందుపరచాలని అధికారులకు దిశా నిర్దేశం చేసింది. తద్వారా పౌరులు, వారి కుటుంబాల సమగ్ర సమాచారాన్ని సేకరించాలని ఆదేశించింది. ఇంటి నంబర్ల కోసం ప్రత్యేక కోడ్‌ను కేటాయించింది.

Caste Census: గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌… 2014లో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించిన సంగతి విదితమే. రాష్ట్రవ్యాప్తంగా ఒకే ఒక్కరోజులో ఆ సర్వేను పూర్తి చేశారు. అయితే అందులోని విషయాలను మాత్రం పదేండ్లపాటు బయటపెట్టకపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో తాము మరోసారి సమగ్ర కుటుంబ సర్వేను, తద్వారా కుల గణనను చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రకటించారు. ఆయన సూచనల మేరకు ఈసారి ఎలాంటి వివాదాలు లేకుండా, ఆరోపణలు రాకుండా గణన చేపట్టాలని ప్రభుత్వం భావించింది. తద్వారా సర్వేలో పారదర్శకతకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సామాజికవేత్తలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పీపుల్స్‌ కమిటీ ఆన్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ అనే సంస్థ ప్రతినిధులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవటం ద్వారా న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

ఇది కూడా చదవండి: MAHAA Vamsi Comment: మీరంతా ఎవరు మాట్లాడటానికి? వైసీపీ నేతలకు వైఎస్ విజయమ్మ సూటి ప్రశ్న!

Caste Census: సర్వే సందర్భంగా రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత? ఎవరెవరికి సంక్షేమ పథకాలు ఎంత మేరకు అందాయి? అవి అందని వారి సంఖ్య ఎంత? తదితరాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు వచ్చే నెల నుంచి సర్వే చేపట్టాలని ప్రణాళికా శాఖను ఆదేశించింది. సంబంధిత ప్రణాళికలు కూడా ఖరారయ్యాయి. సర్వే కోసం మొత్తం మూడు వేల మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వారికి శిక్షణను కూడా ఇవ్వనున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. సర్వే నేపథ్యంలో అధికారులు, సిబ్బంది 15 రోజులపాటు క్షేత్రస్థాయిలోనే ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను వారు సేకరించనున్నారు. ఆ రకంగా రాష్ట్రంలోని 1.10 కోట్ల కుటుంబాలపై సర్వే చేపట్టనున్నారు. ఈ క్రమంలో మొత్తం 75 ప్రశ్నలను ఫార్మాట్‌లో చేర్చగా, ఇందులో సగం వ్యక్తులు, కుటుంబాలకు సంబంధించినవి కాగా, మిగతావి వ్యక్తిగత వివరాలకు సంబంధించినవి ఉన్నాయి.

ALSO READ  సింగరేణి కార్మికులకు బోనస్.. ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు

Caste Census: సర్వేలో భాగంగా మొదటి దశలో అధికారులు… కుటుంబ సభ్యుల సంఖ్యను సేకరిస్తారు. ఆ తర్వాత కుటుంబ యజమాని, సభ్యులు, యజమానితో సంబంధం, జెండర్‌, మతం, కులం/సామాజిక వర్గం, ఉప కులం, కులానికి సంబంధించిన ఇతర పేర్లు, వయస్సు, మాతృభాష, ఆధార్‌ నంబర్లను సేకరించనున్నారు. రెండో దశలో ఓటర్‌ ఐడీ కార్డు, వికలాంగులైతే సంబంధిత పూర్తి వివరాలు, వివాహమైందా? కాలేదా? పెండ్లి నాటికి వయస్సు, ఆరేండ్ల వయసులోపు పిల్లలను పాఠశాలలో చేర్చారా? లేదా? ఒకవేళ చేర్చితే వారి చదువు వివరాలు, మధ్యలో బడి మానేస్తే అందుకుగల కారణాలు మొదలగు అంశాలను సేకరిస్తారు. మూడో దశలో కుటుంబ సభ్యులు చేస్తున్న వృత్తి, ఉపాధి, ఉద్యోగం, రోజువారీ వేతనాలు, జీతభత్యాలు తదితర వివరాలను నమోదు చేసుకుంటారు. వీటితోపాటు కుటుంబ సభ్యులకున్న జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, వార్షికాదాయం, పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతాలు తదితరాంశాలను సేకరిస్తారు. నాలుగో దశలో రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు, ఐదో దశలో భూమి, ధరణి పాస్‌బుక్కులు, భూమిపై తీసుకున్న రుణాల వివరాలను నమోదు చేసుకుంటారు. ఆరో దశలో ఒక్కో కుటుంబానికున్న పశుసంపద, గొర్రెలు, మేకలు, కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు జంతువులు, పక్షుల గురించి నమోదు చేసుకుంటారు. ఇక చివరిదైన ఏడో దశలో కుటుంబ సభ్యుల స్థిరచరాస్థులు, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాలు, నివాస గృహాలు, మరుగుదొడ్లు, ఇంటికి విద్యుత్‌ సదుపాయం లాంటి అంశాలపై వివరాలను సేకరిస్తారు.

Caste Census: ప్రస్తుతం రాష్ట్ర జనాభా 3.80 కోట్లకు పైగా ఉంది. మొత్తం కుటుంబాల సంఖ్య 1.10 కోట్లు దాటిందనేది అధికారిక వర్గాల అంచనా. దీనికి తగ్గట్టుగానే సిబ్బంది నియామకానికి ప్రణాళికా శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఆ ప్రకారంగా ప్రతీ 150 కుటుంబాలకు ఓ సర్వే గణకుడిని నియమిస్తారు. ఈ లెక్కన సర్వే కోసం మొత్తం 75 వేల మంది అవసరమవుతారు. పర్యవేక్షకులుగా మరో 15 వేల మంది అవసరం. వీళ్లందరినీ నియమించేందుకు అన్ని శాఖల నుంచి సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను ఇలాంటి సర్వేలకు పంపించొద్దంటూ కోర్టులు గతంలో తీర్పులు వెలువరించాయి. ఈ నేపథ్యంలో టీచర్లు కాకుండా 15 వేల మంది ఇతర ఉద్యోగులను ఈ సర్వే కోసం నియమించనున్నారు. జిల్లాల్లో కుటుంబాల సంఖ్య ఆధారంగా అన్ని శాఖల నుంచి కనీసం 2,500 నుంచి 3 వేల మంది ఉద్యోగులను ఈ సర్వే కోసం వినియోగించనున్నారు. వీళ్లందరూ 15 రోజులపాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. ఒకసారి సర్వే పూర్తయ్యాక వివరాలు పక్కాగా సేకరించారా? లేదా? అనే దానిపై తనిఖీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. నవంబర్ 30 లోగా సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అన్ని వివరాలు క్రోడీకరించి ఆ నివేదికను మొత్తం 60 రోజుల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.

ALSO READ  America: అమెరికాలో భారీ భూకంపం..రిక్టర్ స్కేల్‌పై 7గా తీవ్రత

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *