BRS: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. ‘బాకీ కార్డు’ పేరుతో అధికార కాంగ్రెస్ పార్టీపై వినూత్న ప్రచారానికి తెరలేపింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించిందంటూ ఇంటింటి ప్రచారం షురూ చేసింది. కాంగ్రెస్ ఆనాడు ఇచ్చిన గ్యారెంటీ కార్డులను ఇంటింటా ప్రదర్శిస్తూ ప్రచారం చేస్తున్నది. రేవంత్ సర్కారు రాష్ట్రంలో ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో తెలుపుతూ.. దానిపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ దశలో కాంగ్రెస్ ఇచ్చిన భరోసా మంత్రం పారుతుందా? అని ఉత్కంఠ నెలకొన్నది.
BRS: గత ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పలు హామీలను ఇచ్చింది. ఆనాడు బీఆర్ఎస్ పాలనను దించేందుకు కాంగ్రెస్ నేతలు హామీల వర్షం కురిపించారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని హామీలను అమలు చేయలేని దైన్యం నెలకొన్నది. ఈ దశలోనే బీఆర్ఎస్ బాకీ కార్డును బయటకు వదిలింది.
BRS: కాంగ్రెస్ మాట తప్పిందని ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పోరాడుతోంది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక జరుగుతుంది. దీంతోపాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. దీంతో ఈ ఎన్నికలు వేదికగా కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
BRS: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చి.. వాటిని విస్మరించిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకంటూ బీఆర్ఎస్ ‘బాకీకార్డు’ను ప్రయోగిస్తున్నది. గతంలో కాంగ్రెస్ విడుదల చేసిన ‘గ్యారంటీ కార్డు’ను ప్రజలకు గుర్తు చేస్తూ.. అందులో పేర్కొన్నహామీలు అమలవుతున్నాయా? అని ప్రజలను నేరుగా కలిసి బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ ఎన్నికల వేళ బీఆర్ఎస్ తెచ్చిన గ్యారెంటీ కార్డు ఫలించేనా?కాంగ్రెస్ భరోసా మంత్రాన్ని జనం ఆదరించేనా? వేచి చూడాలి మరి