BRS: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై మంగళవారం నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆ పార్టీ నేతలు ఫిర్యాదు పత్రం అందజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వాకం వల్లే ఫార్ములా ఈకార్ రేస్ అగిపోయిందని, దీంతో పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
BRS: ఫార్ములా ఈ కార్‌రేస్ వ్యవహారంలో ఇప్పటికే కేసు నడుస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏసీబీ, ఈడీ అధికారులు వేర్వేరుగా విచారణ జరిపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఓ దశలో కేటీఆర్ అరెస్టు అవుతారంటూ ప్రచారం జరిగింది. దీనికి ప్రతిగా కేటీఆర్ తన వాణి వినిపంచారు.
BRS: తాను ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ వల్ల హైదరాబాద్ నగరానికి వందలాది కోట్ల పెట్టుబడులు వచ్చాయని దర్యాప్తు సంస్థలకు కేటీఆర్ తెలిపారు. విదేశీ సంస్థకు బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ జరిగిందని, తన అవినీతి ఏమీ లేదని తెలిపారు. అయితే దీనిపై తాజాగా బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డిపైనే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ కేసు విషయంలో రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందేనని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకముందు ఐపీఎస్ అధికారిగా, క్రైం బ్రాంచి డీసీపీగా, అడిషనల్ డీజీపీగా, వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశానని చెప్పారు. రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లే లేని అవినీతిని పేపరుపై పెట్టి అనవసరంగా తెలంగాణకు నష్టం జరుపుతున్నాడని విమర్శించారు.