BRS: ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల సన్నద్ధతతలో నిమగ్నమై ఉండగా, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికల గోదాలోకి దూకింది. అధికార కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో పడింది. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వాన్ని నిలదీసేందుకని కాంగ్రెస్ బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది.
BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను లేవనెత్తారు. కాంగ్రెస్ వైఫల్యాలపై తాము పోరాడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత మేరకు బాకీ పడిందో ప్రజలకు వివరిస్తామని తేల్చి చెప్పారు.
BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రైతులకు రైతుబంధు, రుణమాఫీ, కౌలు రైతులకు 15 వేల చొప్పున, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున, ఆటో డ్రైవర్లకు దాదాపు రూ.24 వేల చొప్పున, మహిళలకు రూ.2,500 చొప్పున, పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం చొప్పున, వృద్ధులకు నెలకు రూ.4,000, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 గజాల స్థలాలు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు చొప్పున తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని విమర్శించారు.
BRS: ప్రభుత్వం పడిన బాకీని ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ బాకీ కార్డులను రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ప్రతి ఇంటా ప్రజలకు పంచుతామని, ప్రజల్లో చైతన్యం తెచ్చి ఆలోచింపజేస్తామని తెలిపారు. తమకు పడిన బాకీ విషయంపై ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
BRS: ఎన్నికల ముందు రజినీకాంత్ లాగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. నేడు గజినీకాంత్‌లాగా మారారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హామీలను విస్మరించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కాలం దగ్గరపడిందని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదని, కటింగ్ మాస్టర్ అని అన్నారు. అందులో రెండు రకాల కటింగ్‌లు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో పూర్తిచేసిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు ఒకటని, గతంలో కేసీఆర్ ప్రారంభించిన మంచి పథకాలకు కటింగ్ ఇంకోటి అని విమర్శించారు.
BRS: బాకీ కార్డును ప్రతి ఇంటికి పంపుతామని, అప్పుడు ప్రజలు మిమ్మల్ని గల్లా పట్టుకొని అడుగుతారని హరీశ్‌రావు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అసమ్మతి ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడుతున్నారని, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలే సాక్ష్యమని తెలిపారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌కు కూడా ఎంతో కాలం లేదని, దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు.
BRS: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలకు నియామక పత్రాలు ఇచ్చిన ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డికి అది అలవాటుగా మారిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. దానిలో భాగంగా నూతన డీజీపీకి కూడా నియామకపత్రం ఇచ్చారని తెలిపారు. అసలు డీజీపీకి ఒక ముఖ్యమంత్రి నియామక పత్రం ఇవ్వడమేమిటని, ఇది చరిత్రలో ఎక్కడా చూడలేదని విస్మయం వ్యక్తంచేశారు. సీఎం ఇస్తున్నా, ఒక ఉన్నతాధికారి అయిన డీజీపీ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.