Br naidu: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ భక్తులకు వేగవంతమైన సేవలను అందించడంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చేసిన విమర్శలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కౌంటర్ ఇచ్చారు.
“ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. ఉచితంగా, భక్తిస్ఫూర్తితో చేస్తున్న సేవలను వృథాగా అభివర్ణించడం తగదన్నారు.
భక్తులు రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తే మంచిదా? అనే ప్రశ్నను ఆయన ఎత్తి చూపారు. ప్రపంచమంతా టెక్నాలజీని స్వీకరిస్తున్న తరుణంలో, టీటీడీ టెక్నాలజీ వాడితే తప్పేంటని ప్రశ్నించారు.
టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని వినియోగించి రెండు గంటల్లోపే దర్శనం కల్పించగలిగే స్థాయికి చేరుకున్నామని బీఆర్ నాయుడు వివరించారు. ఇది భక్తుల సౌలభ్యానికి తీసుకున్న ముందడుగు అని స్పష్టం చేశారు.
“ఏఐ టెక్నాలజీపై ఎల్వీ చేసిన విమర్శలు అసంపూర్ణ అవగాహనతో చేసినవే. భక్తులకు మెరుగైన సేవలే మా లక్ష్యం” అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

