IndiGo Flight: ముంబై నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానం 6E 762కు మంగళవారం (సెప్టెంబర్ 30, 2025) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఢిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ పంపడంతో విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఎయిర్‌బస్ A321 రకానికి చెందిన ఈ విమానం ఉదయం 7:53 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దాదాపు 200 మంది ప్రయాణికులతో ఉన్న ఈ విమానానికి బెదిరింపు రావడంతో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు.
తనిఖీల్లో బాంబు లేదని నిర్ధారణ
విమానం ల్యాండ్ అయిన వెంటనే, అధికారులు బాంబ్ స్క్వాడ్ బృందంతో కలిసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి జరిగిన తనిఖీల అనంతరం, విమానంలో ఎటువంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు తప్పుడు సమాచారం అని తేలింది.
భారతదేశంలో ఇటీవల కాలంలో వివిధ సంస్థలు, కార్యాలయాలు, విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత వారం, ముంబై నుండి థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపే రావడంతో, దాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసి తనిఖీలు చేశారు. ఆ ఘటనలోనూ బాంబు లేదని తేలింది.
ఈ తరహా బెదిరింపులు తప్పుడు సమాచారం అయినప్పటికీ, విమానయాన భద్రతా ప్రోటోకాల్‌లను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. ఢిల్లీ పోలీసులు ఈ బెదిరింపుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇండిగో సంస్థ అధికారులు భద్రతా తనిఖీలకు పూర్తిగా సహకరించారు.