Bollywood: సుప్రీంకోర్టు ఆశ్రయించిన జాక్వెలిన్

Bollywood: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో మరోసారి న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఢిల్లీ హైకోర్టు తమ పిటిషన్‌ను తిరస్కరించడంతో, ఆ తీర్పుపై సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌పై విచారణను సెప్టెంబర్ 22న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేపట్టనుంది.

కేసు నేపథ్యం

ఘరానా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ అక్రమ సంపాదన కేసులో జాక్వెలిన్ పేరు రావడంతో ఆమె ఇబ్బందులు మొదలయ్యాయి. సుకేశ్ నుండి సుమారు రూ.7.2 కోట్ల విలువైన ఖరీదైన బహుమతులు, ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. ఈ బహుమతులు నేరపూరిత ఆదాయమేనని పేర్కొంటూ, ఇప్పటికే ఆమె ఆస్తులను అటాచ్ చేసింది.

హైకోర్టు తీర్పు

తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ జాక్వెలిన్ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సుకేశ్ అక్రమ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద తనపై విచారణ జరపడం తగదని ఆమె వాదించారు. అయితే, జస్టిస్ అనీశ్ దయాళ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. కేసులో ట్రయల్ కోర్టు విచారణ తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు పిటిషన్

హైకోర్టులో ఊరట దొరకకపోవడంతో జాక్వెలిన్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈడీ పలు ఛార్జిషీట్లు దాఖలు చేసిన నేపథ్యంలో, ఆమెను నిందితురాలిగా చేర్చింది. మరో నటి నోరా ఫతేహిని మాత్రం సాక్షిగా విచారించారు. సుకేశ్ తరఫున అతని సహాయకురాలు పింకీ ఇరానీ ద్వారా ఖరీదైన బహుమతులు జాక్వెలిన్‌కి అందించబడినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *