Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
రేపటిలోపు బీజేపీ అభ్యర్థి ప్రకటన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ఈ రోజు (సోమవారం) విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఖరారును వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ… అనేక మంది విద్యావంతులు, మేధావులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. రేపటిలోగా జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ – మజ్లిస్ రహస్య ఒప్పందం
Also Read: Safe Ride Challenge: భద్రతకు కొత్త ట్రెండ్.. ‘సేఫ్ రైడ్ ఛాలెంజ్’తో హైదరాబాద్ పోలీసులు!
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, లేక మజ్లిస్ పోటీ చేస్తుందా అనేది ప్రజలు గమనించాలని రామచందర్ రావు కోరారు. ప్రస్తుతం మజ్లిస్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు (హస్తం గుర్తు) పై పోటీ చేస్తున్నాడని, హస్తం గుర్తుతోనే పతంగి (మజ్లిస్ గుర్తు)ని ఎగరేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యం – కాంగ్రెస్ హామీలు 420
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, అక్కడ కనీసం ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదని రామచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని, అవన్నీ 420 కేసుల వంటివే అని దుయ్యబట్టారు.
బీజేపీనే గెలిపించండి
నిజమైన ప్రతిపక్షంగా బీజేపీనే కాంగ్రెస్ను ప్రశ్నిస్తుందని, ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన శాసన సభ్యులు (ఎమ్మెల్యేలు) ఆ పార్టీలో ఉంటారో లేదో తెలియదని రామచందర్ రావు అన్నారు. చివరికి వారు పార్టీ మారక తప్పదని, పార్లమెంట్ ఎన్నికలలో వేరే పార్టీ నుండి ‘బి ఫారం’ తీసుకుని పోటీ చేసే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.