Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మొదటి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు ఒకటి రెండు ఓట్లు వచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో ఓట్లు వస్తున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీకి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని కాంగ్రెస్, కేసీఆర్ తెచ్చారని బీఆర్ఎస్ చెబుతున్నాయని.. కానీ, పార్లమెంట్లో బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో యువత ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆయన ఆరోపించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మాటలతో మభ్యపెట్టాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు. రెండు ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయని, గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయలేకపోతున్నాయని ఆరోపించారు.
Also Read: Av Ranganath: వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన
బీసీలకు బీజేపీ అండగా ఉంటుంది
బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని, అయితే కేంద్రంలో మోడీ ప్రభుత్వం విశ్వకర్మ పథకం తెచ్చిందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు ఇస్తుందని, జీఓ ఇస్తే తాము కూడా మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. జీఎస్టీ వల్ల అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరిందని, నిత్యావసరాలు తక్కువ ధరలకు దొరకడానికి మోడీయే కారణమని చెప్పారు. ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో ప్రజలకు అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం నుండి 12 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు.
స్థానిక ఎన్నికలను ఆపొద్దు: బీజేపీకి విజయం ఖాయం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుందని రామచందర్ రావు విమర్శించారు. ఎరువుల కొరత రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా లోపమేనని అన్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్లు హైదరాబాద్‌ను వదిలి గ్రామాలకు వెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, కేంద్రం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ఆపొద్దని, వాటిలో బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కిషన్ రెడ్డి నాయకత్వంలో వంద శాతం బీజేపీ గెలుస్తుందని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆట చేతగాక కిషన్ రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు.