Prashant Kishor: బీహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్ను ప్రకటించింది. ఈ సారి రెండ విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్, నవంబర్ 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. ప్రశాంత్ కిషోర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆ వివరాలు అక్టోబర్ 9న ప్రకటించే అభ్యర్థుల జాబితాలో తెలుస్తాయని పేర్కొన్నారు. రఘోపూర్ (తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం) లేదా ఆయన స్వస్థలం అయిన కర్గహర్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి.
బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని పీకే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల వచ్చిన C-Voter సర్వే ప్రకారం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల మొదటి ఎంపికగా తేజస్వి యాదవ్ ఉన్నప్పటికీ, ప్రశాంత్ కిషోర్ ప్రజాదరణ కూడా గణనీయంగా పెరిగింది. ఆయన సీఎం అభ్యర్థిగా 23% మద్దతుతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇది ప్రజలు సాంప్రదాయ రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని సూచిస్తుంది. ఈ ఎన్నికల ద్వారా బీహార్లో సాంప్రదాయ NDA, మహాఘట్బంధన్లకు మూడవ ప్రత్యామ్నాయంగా జన్ సురాజ్ పార్టీ బరిలోకి దిగనుంది.
ఇది కూడా చదవండి: Venkaiah naidu: ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు విమర్శలు
పీకే తన ఎన్నికల ప్రచారంలో అధికార కూటమి (NDA), ప్రతిపక్ష మహాఘట్బంధన్లు రెండూ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయాయని, అందుకే రాష్ట్రంలో కొత్త వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. పార్టీ తరఫున కనీసం 40 మంది మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని ప్రశాంత్ కిషోర్ ఇదివరకే ప్రకటించారు. ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ పార్టీ (జేడీయూ) 25 కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కిషోర్ సవాల్ విసిరారు. ఈ ఎన్నికలే నితీష్ కుమార్కు చివరి ఎన్నికలు అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.