Rishabh Pant: ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌ను టీమ్ ఇండియా సమం చేసింది. రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు లేకుండానే విదేశీ గడ్డపై తమ బలాన్ని ప్రదర్శించింది. యువ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ప్రస్తుతం నెల రోజుల విరామం తీసుకుంటున్న టీమ్ ఇండియా సెప్టెంబర్‌లో యుఎఇలో ఆసియా కప్-2025 ఆడనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నమెంట్ కోసం బీసీసీఐ ఆగస్టు చివరి వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ తర్వాత, వెస్టిండీస్‌తో సొంత గడ్డపై టెస్ట్ ఆడనుంది.
ఈ క్రమంలో టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఆసియా కప్ 2025 నుంచి దూరం కానున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతనికి గాయం కావడమే దీనికి కారణం. ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా, క్రిస్ వోక్స్ వేసిన యార్కర్ బంతి పంత్ కాలికి బలంగా తగిలింది. దీంతో అతని కాలి వేలుకు ఫ్రాక్చర్ అయ్యింది. గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ, అతనికి సర్జరీ అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ, అతను పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
Also Read: Andhra Premier League: నేటి నుంచి ఐపీఎల్ తరహాలో ఆకట్టుకుంటున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్
ఈ గాయం కారణంగా రిషబ్ పంత్ సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ నుంచే కాకుండా, ఆ తర్వాత వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రిషబ్ పంత్ లేకపోవడం టీమ్ ఇండియాకు ఒక గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అతని స్థానం చాలా కీలకం. అయితే, టీ20 ఫార్మాట్లో పంత్ స్థానంలో సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు అందుబాటులో ఉండటం కొంతవరకు ఊరట కలిగించే అంశం.ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 8-28 వరకు యుఎఇలో జరుగుతుండగా, టీమ్ ఇండియా అక్టోబర్ 2-14 వరకు వెస్టిండీస్‌తో స్వదేశంలో రెండు టెస్టులు ఆడనుంది.

