Bhatti vikramarka: రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్తో తనకు మంచి అనుబంధం ఉందని, గతంలో ఏప్రిల్ 14న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, “పీపుల్స్ మార్చ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తై, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు దొరల పాలనను గద్దె దించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టుతోంది. ఇప్పటి వరకు రూ. 21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశాం. విద్య రంగాన్ని బలోపేతం చేయడానికి రూ. 11,600 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణాన్ని ప్రారంభించాం. మొదటి ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. పేదలకు సన్న బియ్యం అందజేస్తున్నాం” అని వివరించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజాప్రయోజన చర్యల గురించి వివరిస్తూ, “ఇదంతా ప్రజల ఆశీర్వాదంతోనే సాధ్యమైంది. మా ప్రభుత్వానికి ప్రజలే బలం. యువత భవిష్యత్తు కోసం మరిన్ని అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నాం” అని భట్టి పేర్కొన్నారు.