Subhanshu Shukla

Subhanshu Shukla: బెంగళూరు రోడ్లపై వ్యోమగామి శుభాన్షు శుక్లా చమత్కారం

Subhanshu Shukla: బెంగళూరులో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులు ఎంత తీవ్రమైపోయాయో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా మాటల్లో స్పష్టమైంది. గురువారం జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన, అంతరిక్ష ప్రయాణం కన్నా బెంగళూరు రహదారులపై ప్రయాణించడం కఠినమని చమత్కారంగా వ్యాఖ్యానించారు. తన స్పీచ్‌కు పట్టే సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ సమయం మారతహళ్లి నుంచి వేదిక వద్దకు చేరుకోవడానికి పట్టిందని నవ్వుతూ చెప్పడంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ వ్యాఖ్య నగరం ఎదుర్కొంటున్న రవాణా సమస్యపై చర్చకు దారితీసింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుక్లా ఇటీవల చరిత్ర సృష్టించారు. గత జూన్‌లో యాగ్జియం మిషన్ ద్వారా అంతరిక్షాన్ని అనుభవించిన తన అనుభవాలను కూడా సదస్సులో పంచుకున్నారు. అంతరిక్షంలో తొలి రోజుల్లో మన గుండె మీద వాహనం నడుస్తున్నట్లు అనిపిస్తుందని, అక్కడి పరిస్థితులకు అలవాటు పడడానికి వారం రోజులు పడుతుందని, భూమిపైకి తిరిగి వచ్చాక రెండు వారాల పాటు శరీరం అస్థిరంగా ఉంటుందని ఆయన వివరించారు. అయితే ఈ ప్రయాణం భారత అంతరిక్ష ప్రగతికి ప్రతీక అని చెప్పడం అతని గర్వాన్ని ప్రతిబింబించింది. అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందో కూడా వీడియో రూపంలో చూపించారు.

Also Read: Gold Price Today: స్వల్పంగా పెరిగిన పసిడి.. భారీగా దిగివచ్చిన వెండి.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

శుక్లా వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే హాస్యభరితంగా స్పందించారు. అంతరిక్షం నుంచి బెంగళూరుకు రావడం సులభమే కానీ మారతహళ్లి నుంచి సమ్మిట్ వేదికకు రావడం ఎక్కువ సమయమే తీసుకుందని శుక్లా చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

బెంగళూరులో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతున్నదన్నది గణాంకాలే చెబుతున్నాయి. సగటు ప్రయాణ సమయం 54 నిమిషాల నుంచి 63 నిమిషాలకు పెరిగిన సంగతి తెలిసింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే మూడు లక్షలకు పైగా కొత్త వాహనాలు రిజిస్టర్ కావడంతో రోడ్లపై ఒత్తిడి మరింత పెరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న వేళ, స్వయంగా వ్యోమగామి శుక్లా చేసిన వ్యాఖ్యలు నగర ట్రాఫిక్ సమస్యపై మళ్లీ దృష్టి సారింపజేశాయి.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *