Shreyas Iyer: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ (BCCI) వివరణాత్మక వైద్య నివేదికను విడుదల చేసింది. బీసీసీఐ తాజా ప్రకటన ప్రకారం, శ్రేయస్ అయ్యర్‌కు పొత్తికడుపుపై బలమైన దెబ్బ తగిలింది. ఈ బలమైన దెబ్బ కారణంగా అతని ప్లీహం చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం జరిగింది. గాయాన్ని వెంటనే గుర్తించి, రక్తస్రావాన్ని అరికట్టామని, ప్రస్తుతం శ్రేయస్ ఆరోగ్యం నిలకడగా ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. తీవ్రత దృష్ట్యా మొదట సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచినప్పటికీ, తాజా స్కానింగ్ రిపోర్టులు మెరుగుదలను చూపించడంతో అతన్ని ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు.
శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకుంటున్నాడని, సిడ్నీ, భారతీయ నిపుణులతో సంప్రదించి బీసీసీఐ వైద్య బృందం అతని ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొంది. అంతర్గత రక్తస్రావం జరగడంతో, అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ గాయం కారణంగా అతను రాబోయే సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కోలుకోవడానికి కనీసం కొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

