BCCI: టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వన్డే కెరీర్ ముగింపుపై గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ (BCCI) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పూర్తి స్పష్టత ఇచ్చారు. రాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ వీరిద్దరికీ చివరిది కాదని, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆయన తేల్చి చెప్పారు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 19న ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ రిటైర్మెంట్ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. “గత 15 ఏళ్లుగా విరాట్, రోహిత్ దాదాపు ప్రతి భారత జట్టులో భాగమయ్యారు. అందుకే, వారిని ఇక్కడ (ఆస్ట్రేలియాలో) ఆడటం చూడటానికి ఆస్ట్రేలియా అభిమానులకు ఇదే చివరి అవకాశం కావచ్చు. వారు భారతదేశ క్రికెట్‌కు దిగ్గజాలు. వారు ఆడుతున్నప్పుడు అభిమానుల మద్దతు భారీగా ఉంటుంది” అని కమ్మిన్స్ వ్యాఖ్యానించారు.
Also Read: Rashid Khan: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ ఆటగాళ్లు సంచలనం
టెస్టులు, టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ ఇప్పటికే రిటైర్ అయిన నేపథ్యంలో, 2027 వన్డే ప్రపంచకప్ నాటికి వారి వయసు కూడా పెరగనుండడంతో… కమ్మిన్స్ వ్యాఖ్యలు వారి వన్డే కెరీర్‌కు ముగింపు దగ్గరపడిందనే సంకేతాలు పంపినట్లు అయ్యింది. ఈ ఊహాగానాలు, కమ్మిన్స్ వ్యాఖ్యలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించి, సుదీర్ఘ చర్చకు తెరదించారు. “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లు. వారిద్దరూ జట్టులో ఉండటం మాకు గొప్ప బలం. వారి అనుభవం ఆస్ట్రేలియాను ఓడించడంలో కచ్చితంగా సహాయపడుతుంది. ఇది వారి చివరి వన్డే సిరీస్ అని చెప్పడం పూర్తిగా తప్పు. ఇవి కేవలం అసత్య ప్రచారాలు (పుకార్లు) మాత్రమే. వారు ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ఆ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. రోహిత్, కోహ్లీలు రానున్న మరిన్ని వన్డే సిరీస్‌లలో ఆడటానికి సిద్ధంగా ఉన్నారని, 2027 ప్రపంచకప్‌పై కూడా వారి దృష్టి ఉందని తెలుస్తోంది. భారత క్రికెట్‌లో ఈ ఇద్దరు దిగ్గజాల భవిష్యత్తు వారి వ్యక్తిగత ప్రదర్శన, ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.