BC Reservations: బీసీ రిజర్వేషన్ల అమలుపై అయోమయం నెలకొన్నది. ఆర్డినెన్స్ తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిన్న (జూలై 10) జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ దశలో కోర్టుల్లో ఎవరైనా కేసులు వేస్తే ఆర్డినెన్స్ నిలుస్తుందా? చట్టం తెస్తేనే రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుందని బీసీ సంఘాలు కోరుతున్నాయి.
BC Reservations: మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతున్నది. త్వరలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించింది.
BC Reservations: వాస్తవంగా బీసీలకు స్థానిక ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం మూడు నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ప్రవేశపెట్టి ఉభయసభల్లో ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్ర పతి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం ప్రతిపాదనలను పంపింది. ఇప్పటి వరకూ ఆ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.
BC Reservations: ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనగణన, కులగణన చేపట్టాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రం పంపిన బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జాతీయ స్థాయిలో కులగణన అనంతరమే రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలన్న ధోరణిలోనే ఆయా బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని భావిస్తున్నారు. ఏదేమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై కనీస ఒత్తిడి తేలేకపోయిందని బీసీ సంఘాలు, ప్రతిపక్షలు విమర్శిస్తున్నాయి.
BC Reservations: ఇదే దశలో కేంద్రం వద్ద బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్‌లో ఉండటంతోపాటు, స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మూడు నెలల గడువు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తెచ్చి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నది.
BC Reservations: రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ నిర్ణయంపై బీసీ సంఘాలు మండిపడుతున్నారు. 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ఉంటుందని వారు చెప్తున్నారు. ఆర్డినెన్స్ ద్వారా ముందుకెళ్తే.. ఎవరైనా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తే, 50 శాతం మించిన రిజర్వేషన్లకు కోర్టులు కోత విధిస్తాయని, దీంతో ఆర్డినెన్స్‌ను కొట్టివేస్తాయని, ఫలితంగా ఉన్న 42 శాతం రిజర్వేషన్లు అటుంచి, ఉన్న రిజర్వేషన్లకు కూడా ఎసరు వచ్చే ప్రమాదం ఉన్నదని బీసీ నేతలు మండి పడుతున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి మరి.

