Bapatla: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుడు పొట్టిగా ఉన్నాడన్న ఒక్క కారణంతో వధువు సోదరుడు అతన్ని హత్య చేయడం ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేపింది. ఈ హృదయవిదారక ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగంజాగర్లమూడికి చెందిన కుర్రా నాగ గణేష్ (25) ఉద్యోగరీత్యా గుంటూరు సమీపంలోని బుడంపాడులో నివసిస్తున్నాడు. తెనాలికి చెందిన దూరపు బంధువుల అమ్మాయి కీర్తి అంజనీ దేవితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే గణేష్ పొట్టిగా ఉన్నాడని కారణంతో వధువు సోదరుడు దుర్గారావు, కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ, యువజంట పెద్దలను ఎదురించి ప్రేమను నిలబెట్టుకుంది.
సెప్టెంబర్ 25న వారు ఇంటి నుంచి వెళ్లిపోయి అమరావతిలో వివాహం చేసుకున్నారు. అనంతరం బుడంపాడులో కాపురం పెట్టారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన ఈ జంట, రక్షణ కోరుతూ నల్లపాడు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇరువురు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ ఆ సమయంలోనే దుర్గారావు, “నా సోదరిని పెళ్లి చేసుకున్నావు… నిన్ను చంపేస్తా” అంటూ గణేష్‌ను అందరి ముందే బెదిరించాడు.
దీంతో గణేష్ భయంతో బయటకు ఎక్కువగా వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. అయినప్పటికీ, తన పెళ్లి రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలనే ఉద్దేశంతో స్నేహితుడు కరుణతో కలిసి గుంటూరుకు వెళ్లాడు. బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని తిరిగి వస్తుండగా, దుర్గారావు తన స్నేహితులతో కలిసి పక్కా ప్రణాళికతో కాపుకాసి కత్తులతో దాడి చేశాడు. గణేష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలో ఇంత దారుణంగా హత్య జరగడం సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించింది.