Bandi Sanjay: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సిట్‌లు, ఎంక్వైరీలు తప్ప ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని సంజయ్ మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉన్నప్పటికీ, విచారణకు ఆయనను ఎందుకు పిలవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాధాకిషన్ రావు, ప్రవీణ్ రావు వంటి అధికారులు అదే పనిగా ఫోన్లను ట్యాప్ చేశారని, దీని వెనుక కేసీఆర్, కేటీఆర్‌ల పాత్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
నాయకుల ఫోన్లతో పాటు ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్
ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ నేతలకే పరిమితం కాలేదని, హైకోర్టు జడ్జిలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, చివరికి భార్యాభర్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. ఆ సమాచారంతో వారిని బ్లాక్‌మెయిల్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి, “తన ఫోన్ ట్యాప్ కాలేదని హరీష్ రావు ప్రమాణం చేయగలరా?” అని సవాల్ విసిరారు.
వేల కోట్లపై ప్రశ్నల వర్షం
కేసీఆర్‌కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీ, బెంగాల్ ప్రభుత్వాలకు, అలాగే మహారాష్ట్ర ఎన్నికలకు కూడా కేసీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని, రాష్ట్ర ప్రభుత్వ విచారణ కేవలం ఒక నాటకం అని ఆయన కొట్టిపారేశారు.