Bandi Sanjay: కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నల్లకుంట శంకర మఠం సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, విద్యాసంస్థల సమస్యలపై పోరాటం చేస్తామని, వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
బకాయిలు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు!
ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సరికాదని మండిపడ్డారు.
“బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపేందుకు ఉన్న వనరులు, విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించడానికి లేవా?” అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయం అని ఆయన గట్టిగా చెప్పారు.
బ్లాక్మెయిల్కు లొంగవద్దు: విద్యాసంస్థలకు సూచన
ప్రభుత్వం నుంచి బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్మెయిల్ చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ ఒత్తిడికి లొంగవద్దని, అలాగే వాయిదా పద్ధతుల్లో చెల్లింపులకు అంగీకరించవద్దని ఆయన సూచించారు. పెండింగ్ ఫీజులన్నీ చెల్లించేవరకు తాము విద్యాసంస్థలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్లో భాజపా గెలుపు ఖాయం
రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గురించి ప్రస్తావించారు. గతంలో పాలించిన బిఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. గత పదేళ్లలో, ప్రస్తుత పాలనలో ఈ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాజపా గెలవడం ఖాయం అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.