Bandi sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక కుటుంబ నాటకమేనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో “కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్” పేరిట ఒక నాటకం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో “చార్‌పత్తా ఆట” నడుస్తోందని, ఈ “కల్వకుంట్ల సినిమా”కి కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్తో కలవదని స్పష్టం చేశారు. కవిత అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు బీజేపీతో కుమ్మక్కయ్యే ప్రయత్నాలు చేసినా, అవినీతి పరులకు తమ పార్టీలో స్థానం లేదని తేల్చి చెప్పారు. గతంలోనూ, ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.
వేములవాడ గోశాలలో కోడెల మరణంపై స్పందన:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలో పెద్ద సంఖ్యలో కోడెలు మృతి చెందడం బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆలయ ఈవోతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వసతులు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయానికి చెందిన నిధులను గత ముఖ్యమంత్రి ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు.
సైన్యం గురించి సీఎం వ్యాఖ్యలపై విమర్శ:
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు భారత సైన్యంపై అవమానకరంగా ఉన్నాయని బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌తో యుద్ధం ఇంకా కొనసాగుతోందని, ఉగ్రవాదం అంతమయ్యే వరకు అది కొనసాగుతుందన్నది ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటనని గుర్తు చేశారు. దేశ సైనికుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.


