Bala Devi: క్రికెట్ మతంగా ఉన్న భారత్ లో కొన్ని క్రీడలకు అంతగా ప్రాచుర్యం లభించదు. అందులో గొప్పగొప్ప రికార్డులు నెలకొల్పినా సరే. ఓ మహిళా ఫుట్బాలర్ అంతర్జాయంగా 50 గోల్స్ చేసి భారత్ పేరును విశ్వవ్యాపితం చేసింది. పేరుకు బాల దేవి అయినా… ఆటలో మాత్రం పెద్ద పెద్ద రికార్డులు క్రియేట్ చేసింది.
భారత సీనియర్ ఫుట్‌బాలర్, మణిపూర్ మణిపూస బాలా దేవి (Bala Devi) ఘనత ఇపుడో చరిత్ర. గోల్ మెషిన్‌గా పేరొందిన ఆమె అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 50వ గోల్ సాధించి శిఖరంలా నిలిచింది. నేపాల్ ఆతిథ్యమిస్తున్న శాఫ్ మహిళల ఛాంపియన్‌షిప్ (SAFF Womens Championship)లో బాల ఈ మైలురాయి పాతింది. అదీ ప్రియమైన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కావడం విశేషం.
ఫార్వర్డ్ ప్లేయర్ అయిన 34 ఏండ్ల బాల 34వ నిమిషంలో ప్రత్యర్థి గోల్ కీపర్‌ను ఏమారుస్తూ బంతిని గోల్ పోస్టులోకి నెట్టి అర్థసెంచరీ పూర్తిచేసింది. మణిపూర్‌కు చెందిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ 2005లో జట్టులోకి వచ్చింది. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన బాల కెరీర్ గురించి చెప్పాలంటే…ఇండియాకు సంబంధించిన గొప్ప మహిళా శక్తిగా ఆమెను వర్ణించవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానంలో కఠోరంగా శ్రమించిన ఫలితమే ఇది.
ఇంటర్నేషనల్ ఎరీనాలో 50 గోల్స్ చేయడంపై బాల హర్షం వ్యక్తం చేసింది. తన ఘనతకు కారణం తన తండ్రేనని, బాల్యం నుంచే తనకు బంతిని ఎలా డ్రిబిల్ చేయాలి, ఎలా పాస్ చేయాలి, గోల్స్ పోస్ట్ వద్ద ఎంత చురుగ్గా బంతిని తన్నాలనే విషయాలపై తనకు సంపూర్ణ అవగాహన కల్పించాడంటూ తన రికార్డును తండ్రికే అంకితమిచ్చింది. అందుకే సాకర్ ఫ్యాన్స్ అంటున్నారు ఇండియన్ షి పవర్… ది గ్రేట్ బాల అని.

