Viveka Murder Mystery

Viveka Murder Mystery: న్యాయానికి గుండెపోటు!

Viveka Murder Mystery : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఆరేళ్ల మర్డర్ మిస్టరీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన సంచలనం. ఇప్పుడు మరోసారి సుప్రీం కోర్టు మెట్లెక్కింది. 2019లో పులివెందులలో సొంత ఇంట్లో గొడ్డలి వేటుతో దారుణంగా హత్య చేయబడిన వివేకా ఆత్మ, అప్పటి నుండి న్యాయం కోసం ఎదురుచూస్తోంది. వివేకా హత్య కేసు.. వైసీపీ అధికారంలోకి రావడానికి అవసరమైన భావోద్వేగపూరిత వాతావరణాన్ని సృష్టించి, ఏపీలో రాజకీయ లెక్కలను తారుమారు చేసి ఆరేళ్లు అవుతున్నా… న్యాయం మాత్రం ఇంకా దూరంగానే ఉంది.

తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అనుబంధ అఫిడవిట్, ఈ కేసుకు కొత్త ఊపిరి పోసింది. ఈ అఫిడవిట్‌లోని సంచలన అంశాలు ఒక్కసారిగా అన్ని వేళ్లనూ వైఎస్ అవినాష్ రెడ్డి వైపు చూపేలా చేశాయి. “చిన్న పిల్లోడు, అమాయకుడు” అంటూ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి కితాబిచ్చిన అవినాష్‌ రెడ్డే ఈ కేసు వెనుకున్న మాస్టర్‌మైండ్‌గా ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ అఫిడవిట్ ప్రకారం, వివేకా హత్య.. పథకం నుండి అమలు వరకూ అవినాష్ రెడ్డే కీలక పాత్ర పోషించాడు.

హత్య జరిగిన వెంటనే మీడియా ముందు “గుండెపోటు” అనే తప్పుడు కథనాన్ని అల్లడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, విచారణను తప్పుదారి పట్టించడం.. ఇవన్నీ అవినాష్ చేసిన నేరాలు, ఘోరాలే అని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలియజేసింది. అంతేకాదు, వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై కేసు నెట్టడానికి అవినాష్.. వివేకా పీఏ కృష్ణారెడ్డిని వాడుకున్నట్లుగా కూడా పేర్కొంది. ఈ ఆరోపణలు నిజమైతే, ఒక ఎంపీగా, జగన్ బంధువుగా అవినాష్.. రాజకీయ శక్తిని ఉపయోగించి న్యాయాన్ని అడ్డుకున్నాడనే అర్థం.

Viveka Murder Mystery: 2019లో జరిగిన వివేకా హత్య కేసు… కాలక్రమంలో స్థానిక పోలీసుల నుండి సీబీఐకి, ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యింది. 2020లో సీబీఐ టేకప్‌ చేసిన ఈ కేసులో… 2021లో మొదటి ఛార్జిషీట్, 2022లో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలయ్యాయి. 2022 నవంబర్‌లో సుప్రీం కోర్టు దీన్ని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది. అవినాష్‌కు 2023 మేలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అతని తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసినా, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆరేళ్లలో ఆరుగురు కీలక సాక్షులు అనుమానాస్పదంగా చనిపోయారు. వివేకా కూతురు సునీత మాటల్లో చెప్పాలంటే.. నిందితులు బయట తిరుగుతుంటే, బాధితులే శిక్ష అనుభవిస్తున్నారు.

Also Read: CM Chandrababu: రెండు రోజుల కలెక్టర్ల సదస్సు . . డీఎస్సీ నుంచి టూరిజం దాకా చంద్రబాబు ఏమి చెప్పారంటే . .!

Viveka Murder Mystery: అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.. కానీ ఆరేళ్లలో ఒక్క ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. మరోవైపు సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా చనిపోతున్నారు. ఇటీవలే వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న మరణం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం కేసుకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. వివేకా హత్య వెనుక కుట్ర… రాజకీయ ఆటలతో మొదలైందని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌లో చెబుతోంది. కడప ఎంపీ సీటుపై వివేకా జగన్‌తో విభేదించడం, అవినాష్‌కు బదులు షర్మిల లేదా విజయమ్మను నిలబెట్టాలని పట్టుబట్టడం ఈ హత్యకు కారణమైందని సీబీఐ గతంలోనే ఆరోపించింది. ఈ విషయాలు నిజమైతే, జగన్ చెప్పిన “చిన్న పిల్లాడు” చిన్న ఆట కాదు, పెద్ద కుట్ర ఆడాడని అర్థమవుతుంది.

రాజకీయ ఒత్తిళ్లు, సాక్షుల మరణాలు, విచారణలో అడుగడుగునా అనేక అడ్డంకులు కల్పించడం.. ఇవన్నీ సీబీఐ చేతులు కట్టేశాయ్‌, న్యాయాన్ని గుండెపోటుకు గురిచేశాయ్‌ అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసు, ఆరేళ్ల తర్వాత అయినా నిజాలను వెలికితీస్తుందా? లేక మరోసారి రాజకీయ డ్రామాగా మిగిలిపోతుందా? న్యాయం గెలుస్తుందా? లేక శక్తిమంతుల చేతిలో ఖననం అవుతుందా? అంటే కాలమే సమాధానం చెప్పాలి! ఈ కేసులో కూటమి ప్రభుత్వం చూపుతున్న చొరవతో.. సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్‌తో.. త్వరలోనే అవినాష్ బెయిల్ రద్దు కావచ్చు, సీబీఐ మళ్లీ యాక్టివ్ అవ్వొచ్చు. మరి ఆరేళ్ల ఈ రక్తపాత నాటకానికి ముగింపు దగ్గరపడినట్లేనా? లేక మరో రాజకీయ డ్రామాకు ఇదో ప్రారంభమా? అన్నది సీబీఐ, కోర్టుల చేతిలోనే ఉంది. కానీ ఒకటి మాత్రం క్లియర్.. ఈ కేసు కేవలం హత్య కథ కాదు. అధికారం, ఆధిపత్యం, అసూయలతో నడిచిన రాజకీయ రక్తచరిత్ర!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *