Visakha YCP Leaders: అన్నెంరెడ్డి అదీప్ రాజ్.. పెందుర్తి నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే. ఒకప్పుడు నియోజకవర్గంలోనే రారాజుగా తిరిగిన ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే జాడ నేడు పూర్తిగా కనిపించకుండా పోయింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ వేవ్ పుణ్యమా అని మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ హయాంలో అత్యంత పిన్న వయస్సు కలిగిన ఎమ్మెల్యేలలో అదీప్ రాజ్ ఒకరు. అలాంటి చక్కటి అవకాశాన్ని ఈ మాజీ ఎమ్మెల్యే ఉపయోగించుకోలేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అందుకే మొన్న 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతిలో ఘోర పరాభవం చెందారు. అదీప్ రాజ్ వ్యవహార శైలి చాలా వివాస్పదంగా ఉంటుంది. కార్యకర్తలని కనీసం పట్టించుకోలేదని అపవాదు కూడా మూటకట్టుకున్నారు. మరో మాటలో చెప్పాలి అంటే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక నియోజకవర్గంలో చులకన అయ్యారని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటుంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత భారీగా సెటిల్మెంట్లు, భూకబ్జాలు చేశారని అప్పట్లో భారీగా విమర్శలు వ్యక్తమయ్యాయి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువనేత ఇప్పుడు భారీగా ఆస్తులు సంపాదించారని చుట్టుపక్కల నియోజకవర్గంలోనూ టాక్ నడుస్తోంది.
పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దానికి కారణం మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ వ్యవహార శైలి అని పార్టీలో కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం కార్యకర్తలను కానీ, లోకల్ నాయకులను కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారైనా నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుంటానని ఎన్నికల్లో హామీలు గుప్పించిన ఈ మాజీ వైసీపీ ఎమ్మెల్యే… నేడు ప్రజలకు ముఖం చూపించుకోలేక ఇంటికే పరిమితమయ్యాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు, ఇలా ఒక్కొక్కరిగా పార్టీకి గడచిన ఏడాది నుండి దూరం అవుతూనే వచ్చారు. 2019 నుండి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో నియోజకవర్గంలో లెక్కలేనన్ని భూకబ్జాలు, అవినీతి కార్యక్రమాలు విచ్చలవిడిగా సాగించిన చోటమోటా నేతలు సైతం ఇప్పుడు వైసీపీని వదిలి బయటకు పోతున్నారు. ఇక పార్టీ ఎదుగుదల కోసం జెండా మోసిన నేతల్ని సైతం మాజీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: MLC Kavitha: కాళేశ్వరం కమిషన్ కాదు.. అది కాంగ్రెస్ కమిషన్..
Visakha YCP Leaders: ఎమ్మెల్యేగా తన గెలుపుకు సహకరించిన నాయకులను అదీప్ రాజు గెలిచిన తర్వాత దూరం పెట్టారని టాక్. దీంతో వారు ఒక్కొక్కరుగా దూరం జరుగుతున్నారు. దీనికి తోడు ఎన్నికల్లో అదీప్ రాజ్ ఓడిపోయిన నాటి నుండి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా గండి రవికుమార్ పేరు నియోజకవర్గంలో ఎక్కువగా వినిపించడంతో కాస్తంత అసహనానికి గురై.. అదీప్ రాజ్ పంచాయతీని జగన్ వద్దకు తీసుకువెళ్లినట్లు.. అక్కడ నుండి గండి రవి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇలా అదీప్ రాజ్ కార్యకర్తలని, సీనియర్ నాయకులని, తన అనుచర వర్గాన్ని ఒక్కొక్కరిని దూరం చేసుకుంటూ.. తాను కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పార్టీ.. త్వరలోనే నియోజకవర్గ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి కొత్త అభ్యర్థి ద్వారా పెందుర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యచరణ రచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.