Venkatesh Naidu History: పంజా సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లే చేసిన రోల్ బాగా ఫేమస్. అందులోని ఓ సన్నివేశంలో మీరు ఏం చేస్తుంటారు? అంటూ హీరోయిన్ హీరోని ప్రశ్నిస్తుంది. అందుకు హీరో.. ”పవర్ మేనేజ్‌మెంట్” అంటూ సమాధానమిస్తాడు. పబ్లిక్ సెక్టార్, ప్రయివేట్ సెక్టార్, గవర్నమెంట్ సర్వెంట్స్ మధ్యలో ఉండే చిన్న చిన్న గ్యాప్స్‌ని ఫిల్ చేస్తుంటానని చాలా స్టయిలిష్‌గా చెప్తాడు కానీ.. ఆ పనికి అసలు పేరు “పవర్ బ్రోకర్”. మన దేశాన్ని షాక్‌కు గురి చేసిన పవర్ బ్రోకర్లు కూడా ఉన్నారు. సుఖేశ్ చంద్రశేఖర్, నీరా రాడియా, మాంసం వ్యాపారి మహ్మద్ అలీ లాంటి వ్యక్తులు ఈ పవర్ బ్రోకర్ల లిస్టులో చాలా ఫేమస్ అయ్యారు. తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ-34 నిందితుడుగా ఉన్న వెంకటేష్ నాయుడు ఆ లిస్టులో చేరిపోయేలా ఉన్నాడు. అతని మాఫియా సామ్రాజ్యం పరిధి చూస్తుంటే ఆ రేంజ్‌లో ఉంది మరి.
మొన్నటిదాకా ఈ వెంకటేష్ నాయుడు ఎవరో కూడా ఎవడికీ తెలీదు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇతను స్కామ్ మేట్ అని వెలుగులోకి వచ్చాక… చెవిరెడ్డి చేస్తున్న విపరీత చేష్టలు, ప్రెస్మీట్లలో పెద్దగా అరవడాలు, సిట్ అధికారులపై కేకలు, ఏడుపులు, పెడబొబ్బలు, ఫాదర్ సెంటిమెంట్ స్టోరీలు.. ఇవన్నీ చూశాక సిట్‌కు మరింత బలంగా అనుమానాలు మొదలయ్యాయి. దీంతో వెంకటేష్ నాయుడికి కస్టడీలో బాగా నలుగుపెట్టి, ఆధారాలు వెలికి తీశారు. అతని ఫోన్ నుండి డిలీట్ చేసిన వీడియోలు రికవరీ చేశారు. ఇంకేముంది.. మనోడి లిక్కర్ లీలలు, నోట్ల కట్టల సిత్రాలు, సినిమాలు, హీరోయిన్లు, స్పెషల్ ఫ్లయిట్లలో జల్సాలు, రాజకీయ నేతలతో పరిచయాలు అన్నీ వెలుగు చూశాయి.
Also Read: Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి.. సుప్రీంకు తెలిపిన సీబీఐ
వెంకటేశ్ నాయుడి గురించి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇతను నెల్లూరు జిల్లాలో పుట్టి, నంద్యాలలో సెటిల్ అయ్యి, ఉస్మానియాలో చదివి, హైదరాబాద్ అడ్డాగా పవర్ బ్రోకరిజం మొదలుపెట్టి, అప్పట్లో తెలుగు స్టేట్స్‌లో పవర్‌లో ఉన్న బీఆర్‌ఎస్-వైసీపీ నేతలతో అంటగాగి, జగన్ రెడ్డి మన్ననలతో లిక్కర్ స్కామ్‌లో కీ రోల్ పోషించి, ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. వెలుగు చూస్తున్న అంశాలను బట్టి.. ఇతనికి జగన్ కుటుంబ సభ్యులతోనూ సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యం వల్లే బడా నేతలకు ప్రొటోకాల్‌లో భాగంగా కేటాయించే బుగ్గ కారును ఇతనికి కేటాయించినట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ వెలుగు చూడగానే అబ్‌స్కాండ్ అయిపోయిన వెంకటేష్ నాయుడుపై జూన్ 1న లుక్ అవుట్ నోటీస్ జారీ అయ్యింది. స్పెషల్ ఫ్లయిట్‌లో మాల్దీవులకు పారిపోతుండగా జూన్ 18న బెంగుళూరులోని కెంపగౌడ విమానాశ్రయంలో సిట్ పట్టుకుంది. ఎలాంటి స్థిర, చరాస్థులు లేని వెంకటేష్ నాయుడు ఎక్కడికి వెళ్లినా స్పెషల్ ఫ్లయిటే వాడతాడు. ఒంగోలు లోక్‌సభకు చెవిరెడ్డికి డమ్మీ క్యాండిడేట్‌గా నామినేషన్ కూడా వేశాడు ఈ వెంకటేష్ నాయుడు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని క్రిషి వ్యాలీలోని ఫ్లాట్‌ను ముడుపుల డెన్‌గా మార్చి.. ఎన్నికలకు ముందు చేరాల్సిన వారికి చేరవేసేవాడట. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఇతనికి కానీ, ఇతని భార్య పేరిట కానీ కనీసం ఇళ్లు కూడా లేదు. కానీ హైదరాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్‌లో ఉంటాడు, స్పెషల్ ఫ్లయిట్లలో తిరుగుతుంటాడు.
డెన్‌లో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కపెడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది ఏఐ క్రియేటెడ్ వీడియో అని వైసీపీ అనలేదు కానీ.. ఇంకా బుకాయిస్తూనే ఉంది. అయితే పదుల సంఖ్యలో ఇలాంటి వీడియోలు సిరీస్‌గా విడుదలవ్వబోతున్నాయని సిట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే వీడియోల్లో సాక్షాత్తూ బిగ్ బాస్ ప్రత్యక్షమైనా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో అంతిమ లబ్ధిదారుడు ఇక అరెస్టుకు ప్రిపేర్ అవ్వడం మంచిది అంటున్నారు పరిశీలకులు.