Nizamabad: ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణ కసరత్తులు పూర్తి చేసింది. సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యతనిచ్చింది. కానీ ఆశావహుల్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎవరికి మంత్రి పదవులు, ఇతర కీలక పదవులు ఇవ్వాలనేది స్వయంగా రాహుల్ గాంధీ దిశా నిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. సామజిక సమీకరణాల సంగతి ఎలా ఉన్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి వర్గ విస్తరణలో ఈసారి ప్రాతినిధ్యం వుంటుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ పెద్దల వద్ద పట్టుబడుతున్నారట. అయినప్పటికీ సుదర్శన్ రెడ్డికి ఈసారి సామజిక సమీకరణాలే శాపంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
కులగణన తెరమీదికి రావడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం కాంగ్రెస్ పెద్దలకు అనివార్యంగా మారింది. అందుకే కనీసం ఇద్దరు బీసీలను క్యాబినెట్లోకి తీసుకోవాలనేది అధిష్టానం చెప్తున్న మాటగా ఉంది. సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నా… జిల్లాకు ప్రాతినిథ్యం ఇస్తే సుదర్శన్ రెడ్డి తప్ప.. మరో పేరే అధిష్టానం వద్ద లేదంటున్నారు. కానీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
సొంత జిల్లా కావడంతో… అధిష్టానం ఆయన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. దీంతో మహేష్ గౌడ్ ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.
Also Read: Gajwel Political Heat: గజ్వేల్లో రాజకీయం మారుతోందా?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన
ప్రతిసారీ జిల్లాకు మంత్రి పదవి దక్కింది. చరిత్ర చూస్తే జిల్లాకు రెండు సార్లు ఆర్థిక శాఖ దక్కింది. రాజారాం, సంతోష్ రెడ్డి, బాలాగౌడ్, డీఎస్, షబ్బీర్ అలీ లాంటి నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖలే దక్కాయి. సురేష్ రెడ్డికి ఏకంగా స్పీకర్ పదవే దక్కింది. చరిత్రలో మొదటిసారిగా ఏడాదిన్నర కాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి మంత్రి లేరు. కానీ ఈసారి… మొదటి దఫాలోనే ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశ చెందాయి. జిల్లాకు మంత్రి లేకపోవడంతో పాలనా వ్యవస్థను గాడిలో పెట్టేవారే లేకుండా పోయారన్న అభిప్రాయం ఉంది. సామాజిక సమీకరణాల సంగతి ఎలా ఉన్నా… ఈసారి జిల్లాకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు బలంగా కోరుతున్నాయి.

