Tirupati TTD Incharge: తిరుపతి టిడిపి ఇంచార్జి నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొన్నటివరకు తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇంచార్జిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించడంతో, ప్రస్తుతం టిడిపి ఇంచార్జి పదవిపై చాలామంది ఆశావహులు కన్నేసిన పరిస్థితి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తిరుపతి ఇంచార్జి పదవికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సుగుణమ్మకు నామినేటెడ్ పదవి దక్కడంతో ఖాళీ సీటుపై చాలా మంది కన్నుపడింది. ఇప్పటికే తిరుపతికి చెందిన సీనియర్ టిడిపి నేత నరసింహ యాదవ్‌కు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం, తిరుపతి ఇంచార్జి రేసులో ఉన్న వూకా విజయ్ కుమార్‌కు ఏపీ అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కేటాయించడంతో రేసు నుంచి వీళ్లిద్దరూ తప్పుకున్నట్లయింది. అయితే, తిరుపతి టీడీపీ ఇంచార్జ్ పదవి ఆశిస్తున్న నేతలు చాలా మందే ఉన్నప్పటికీ.. అధిష్టానం దృష్టిలో ప్రధానంగా ఓ ముగ్గురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతి టిడిపి రేసులో మొదటి వరుసలో యూత్ ఫాలోయింగ్‌తో పాటు బలిజ సామాజిక వర్గానికి చెందిన డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ జె.బి.శ్రీనివాస్ మొదటి వరుసలో ఉన్నారనే టాక్ వినపడుతోంది. ఇతనికి టీడీపీ సీనియర్ మంత్రి అచ్చెం నాయుడుతో పాటు తిరుపతి జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ సపోర్ట్ బలంగా ఉన్నట్లు సమాచారం. మొన్న జరిగిన తిరుపతి కార్పొరేషన్ డీప్యూటి మేయర్ ఉప ఎన్నికల్లో తనదైన శైలిలో చురుగ్గా రాజకీయం నడిపి వైసీపీకి సంబంధించిన అసంతృప్తి కార్పొరేట్లను తమ వైపు తీప్పుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు జేబీ శ్రీనివాస్. దీంతో కార్పొరేషన్ డీప్యూటీ మేయర్ ఎన్నిక టిడిపి ఖాతాలోకి పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రహించి, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. మరోపక్క టిడిపి యువనేత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం జేబీ గట్స్ చూసి మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చూస్తుంటే తిరుపతి టీడీపీ ఇంచార్జ్ పదవి జేబీ శ్రీనివాస్‌కే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక జేబీ శ్రీనివాస్ తరహాలోనే రేస్‌లో ఉన్న మరో సీనియర్ అండ్ పవర్ఫుల్ పొలిటీషియన్ మబ్బు దేవనారాయణరెడ్డి. మొన్నటి వరకూ తుడా చైర్మన్ పదవి ఆశించి, రాకపోవడంతో ప్రస్తుతం తిరుపతిలో మిగిలిన ఉన్న ఏకైక ప్రాముఖ్యత కలిగిన పదవి అయిన టీడీపీ ఇంచార్జ్ పోస్ట్ కోసం రేసులో నిలిచారు. తిరుపతి రాజకీయాల్లో మబ్బు కుటుంబం సీనియర్ మోస్ట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కోట్ల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం మబ్బు దేవనారాయణరెడ్డికి కలిసొచ్చే అంశమని చెప్పక తప్పదు. అయితే తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. ఇక్కడ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీంతో బలిజ సామాజిక వర్గాన్ని తోసిరాజని, రెడ్డి సామాజిక వర్గానికి తిరుపతి ఇంచార్జ్ పదవి ఇస్తారా అన్న అనుమానమూ వ్యక్తమౌతోంది. అయితే మబ్బు దేవనారాయణరెడ్డి సీనియర్ మోస్ట్ నేత కావడంతో… రాష్ట్ర స్థాయి పదవి, లేకుంటే ఏదైనా కేంద్ర స్థాయి పదవితో ఆయనకు అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం..
Tirupati TTD Incharge: ఇక తిరుపతి ఇంచార్జ్ రేసులో ఉన్న మరో లీడర్.. డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం. ఈయన తండ్రి స్వర్గీయ కోడూరు సుబ్బయ్య టిడిపి సీనియర్ పొలిటిషియన్ కావడంతో, సీఎం చంద్రబాబుతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది. మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ల మద్దతు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యంకు కలిసొస్తోంది. మొత్తానికి ఈ నెల 27, 28, 29 జరగబోయే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలైన మహానాడు సభలకు ముందే తిరుపతి ఇంచార్జి పదవి ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి దక్కడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.