Sindh Bandh To Pakistan: పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ గొంతు ఎండిపోవడమే కాదు.. ఆ దేశంలో చాలా మటుకు ప్రాంతం ఎడారిలా మారిపోయే ప్రమాదం ఉంది. అయితే, సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినంత మాత్రాన పాకిస్తాన్‌కి ఇప్పటికిప్పుడు వచ్చిపడే ఉపద్రవం ఏమీ లేదంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే సింధూ జలాలను ఆపడం అంత సులభమేమీ కాదు.
పాక్ వ్యవసాయ ఉత్పత్తిలో అత్యధిక శాతం అందిస్తున్న పంజాబ్ ప్రావిన్స్‌ను “బ్రెడ్ బాస్కెట్”గా పిలుస్తారు. పంజాబ్ అంటేనే “ఐదు నదుల భూమి” అని అర్ధం. ఆ పంజాబ్ ప్రావిన్స్‌తో సహా పాక్‌లోని మొత్తం 65% భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థానులోని మూడు అతి పెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. ఒక్కమాటలో చెప్పాలంటే సింధూ నది పాకిస్థాన్ జీవనాడి! విద్యుత్తు, తాగు, సాగునీటి అవసరాలను తీర్చే కామధేనువు. అటువంటి సింధు నదితో పాటూ దాని 5 ఉపనదులైన జీలం, చీనాబ్, సట్లెజ్, బియాస్, రావి నదీ జాలలు పాక్ వరకూ చేరాలంటే.. మన దేశ భూభాగం మీదుగానే ప్రవహించాలి. అందుకే సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ సస్సెండ్ చేసి పడేసింది అనగానే.. పాకిస్థాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఆ దేశ ప్రజలు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.
అయితే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా ఇప్పటికిప్పుడు పాక్‌కి వచ్చే నష్టమేమీ ఉండదు. ఈ చర్య పాకిస్తాన్‌పై తక్షణ ప్రభావం చూపదు. కానీ ఆ దేశంపై మానసిక ఒత్తిడిని సృష్టించే ఓ వ్యూహం. సింధూ జలాల ఒప్పందం ప్రకారం…. సింధూ నదీ వ్యవస్థలోని తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలను భారత్ అపరిమితంగా వినియోగించుకుంటుంది. పశ్చిమ నదులైన సింధూ, జీలం, చినాబ్ నదీ జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్ దిగువ ప్రాంత దేశం కావడంతో, ఈ నదీ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. ఎగువన ఉన్న భారత్ ఈ నది ప్రవాహానికి ఏ అంతరాయం కలిగించినా… పాక్‌లో పంటల దిగుబడి దెబ్బతిని, ఆహార కొరత, ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయుల కోసం గాలింపు.. ఓ యువకుడి అరెస్టు.. నలుగురికి నోటీసులు
Sindh Bandh To Pakistan: అయితే, ఒప్పందం రద్దు వల్ల తక్షణంగా నీటి ప్రవాహాన్ని ఆపలేం. భారత్‌కు సింధూ, జీలం, చినాబ్ నదుల నీటిని ఆపే లేదా మళ్లించే సౌకర్యం ప్రస్తుతం లేదు. ఇప్పటిదాకా ఒప్పందం ప్రకారం నడుచుకోవడంతో ఈ నదులపై ఎలాంటి రిజర్వాయర్లు లేదా డ్యామ్‌ల నిర్మాణాన్ని భారత్ చేపట్టలేదు. కానీ ఒప్పందం రద్దుతో భారత్ ఇప్పుడు డ్యామ్‌ల నిర్మాణం ప్రారంభించవచ్చు. కానీ అది రోజుల్లోనో, నెలల్లోనో అయ్యే పని కాదు. సంవత్సరాల సమయం పడుతుంది. సుమారు దశాబ్దం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అదే పాక్ ధైర్యం కావొచ్చు. కానీ భారత్ అన్నంత పనీ చేస్తే మాత్రం.. మరికొన్ని సంవత్సరాల్లోనే.. ఎలాంటి యుద్ధం అక్కర్లేకుండానే.. పాక్ మట్టిలో కలిసిపోతుంది.