Shakthi Sadhan Scam

Shakthi Sadhan Scam: కడప నడిబొడ్డున షాకింగ్‌ ఘటన!

Shakthi Sadhan Scam: కడప జిల్లాలో శక్తి సదన్‌ల పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటున్నారనే ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శనివారం కడప చేరుకుని, ఐసీడీఎస్ పీడీ రమాదేవి నుంచి ఫోన్ ద్వారా చిరునామాలు తెలుసుకున్నారు. వివేకానంద నగర్‌లోని ఒకే భవనంలో భారతరత్న మహిళా మండలి నిర్వహిస్తున్న రెండు శక్తి సదన్‌లను పరిశీలించారు. ఈలోపు ఐసీడీఎస్ పీడీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆకస్మిక తనిఖీలో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న నిరాధార మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ సదన్‌లలో ఏ ఒక్కరూ ఆశ్రయం పొందినట్లు ఎలాంటి దాఖలాలు కనిపించలేదు. ఎన్నో నెలలుగా వినియోగించని స్థితిలో ఉన్న భవనంలో కనీస సౌకర్యాలు కూడా లేవు. లెక్కల ప్రకారం 99 మంది మహిళలు ఆశ్రయం పొందుతున్నట్లు రికార్డులు ఉండగా, ప్రాంగణంలో ఒక్కరూ లేకపోవడం గమనార్హం. అధికారులు ఒకసారి 25 మంది ఉన్నారని, మరోసారి 32 మంది ఉంటున్నారని చెప్పినా, వాస్తవానికి అక్కడ ఎవరూ లేరని నిర్ధారణ అయింది. సదన్‌ నిర్వాహకురాలు మూలే సరస్వతికి ఫోన్ చేసి ప్రశ్నించగా, అందర్నీ విజయవాడకు తీసుకొచ్చానని, దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం అందరినీ విజయవాడ తరలించానని నోటికొచ్చింది చెప్పడం మరో విడ్డూరం. మరిన్ని వివరాలు కూపీలాగే ప్రయత్నం చేయగా.. ఆమె ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చామని చెప్పుకున్న నిర్వాహకురాలు, ప్రభుత్వాన్ని, అధికారులను బోల్తా కొట్టించాలని చేసిన ప్రయత్నాన్ని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ పసిగట్టేశారు. ఇలా లేని మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తూ… ప్రతి నెలా రూ.5 లక్షల మేర ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దగా చేయడమేనని రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Election Commission: ఎన్నిక‌ల సంఘం తెచ్చిన 17 సంస్క‌ర‌ణ‌లు ఇవే..

ఈ అవకతవకల వెనుక అదృశ్య శక్తి ఎవరు? అధికారులు చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అధికారులకు తెలియకుండానే ఈ తంతు జరుగుతుందా? అధికారుల నిర్లక్ష్యానికి కారణం ఏమిటి? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు రాయపాటి శైలజ. నగరం నడిబొడ్డున ఇంత జరుగుతున్నా కనిపెట్టలేకపోవడం స్పష్టమైన నిర్లక్ష్యమేనని, ఇలాంటి నిర్వాహకులు ఉండటంతోనే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్పెషల్ క్లాస్ పీకి, “ఎక్కడా తగ్గేదే లేదు” అని తీవ్రంగా స్పందించిన శైలజ, సంబంధిత శాఖ అధికారులపై నమ్మకం లేక స్వయంగా తనిఖీలు చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. శక్తి సదన్‌లలో అధికారుల వాటా ఎంతో పరిశీలించాలని, నిర్వాహకులతో పాటు నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *