Sajjala Situation in YSRCP: వైసీపీలో ఎవరి మాట వినాలి?? వైసీపీని నడిపిస్తున్నది ఎవరు?? అందరికీ బాస్ జగన్ రెడ్డి అయితే.. జగన్‌కి బాస్ ఇంకొకరు ఉన్నారా?? ఇదే ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియాలో హాట్ డిస్కషన్. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించాలా? లేక ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు వినాలా? అన్న చర్చ లేవదీస్తున్నారిప్పుడు. నాలుగు రోజుల క్రితం ఓ మీడియా కాన్క్లేవ్లో సజ్జల చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద దుమారాన్నే రేపాయి. అమరావతి రాజధాని విషయంలో జగన్ విధానానికి విరుద్ధంగా సజ్జల మాట్లాడటం చర్చనీయాంశమైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురాగా, ఓటమి తర్వాత అమరావతి అభివృద్ధికి మద్దతిస్తామని సజ్జల ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు జగన్ ఆమోదంతోనే చేశారా? లేక సజ్జ సొంత అభిప్రాయమా? అనే సందేహం పార్టీలో నెలకొంది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల సకల శాఖల మంత్రిలా వ్యవహరించారు. ఆయన మాట జగన్ మాటగా భావించారు. గత 15 నెలలుగా కూడా అమరావతిని “ముంపు రాజధాని, కమ్మ రాజధాని” అని విమర్శించిన వైసీపీ కార్యకర్తలు… సజ్జల ప్రకటన తర్వాత ఆ ప్రచారాన్ని ఆపేశారు. అయితే, సజ్జల వ్యాఖ్యలపై జగన్ సీరియస్ అయ్యారని, ఆయనను పక్కనపెట్టాలని సూచించారని వైసీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచురించింది. ఈ వ్యవహారం పార్టీలో గందరగోళం సృష్టించింది. ఆ తర్వాత సజ్జల బయట కనిపించకపోవడంతో జగన్ నిజంగానే ఆయనపై ఆగ్రహించారా అనే చర్చ జోరందుకుంది.
Also Read: Telangana: తెలంగాణ సచివాలయంలో తాగునీటి కష్టాలు.. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు!
వైఎస్ జగన్‌ను నాలుగ్గోడల మధ్య బందీ చేసి, పాలనంతా తన చేతుల మీదుగా సాగేలా చేసుకోవడంలో సజ్జల చాణక్య నీతిని తప్పక అభినందించాలి అంటూ వైసీపీకి ఫేవర్డ్గా ఉండే ఓ మీడియాలో రాసుకొచ్చారు. రాజకీయాలతోనూ, వైసీపీ శ్రేణులతోనూ ఏ మాత్రం ప్రత్యక్షంగా సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీకి అధికార రథసారధి కావడం చిన్న కథ కాదట. సాంకేతికంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డే కానీ వ్యవహారాలన్నీ నడిపేది, నడిపించేది సజ్జలేనట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్‌రెడ్డి తెలివిగా అన్నీ చక్కబెట్టుకున్నారట. వైసీపీ అధికారాన్ని సంపూర్ణంగా అనుభవించిన పుణ్యాత్ములు ఎవరంటే సజ్జల, ఆయన కొడుకేనట. వైసీపీ అధికారం నుంచి దిగిపోవడంతో వైఎస్ జగన్‌తో పాటు కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఎంతో నష్టపోయారనీ, కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో నష్టపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సజ్జల మాత్రమేనని చెప్పుకొచ్చింది సదరు మీడియా. కూటమి ప్రభుత్వం దెబ్బకు వైపీఎస్లు, వైసీపీ కీలక నాయకులైన మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి, అలాగే ఉన్నతాధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తదితరులు జైలుకెళ్లారనీ, రేపో మాపో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను జైల్లో వేస్తారని.. కానీ ఈ కేసుల్లో ఎక్కడా సజ్జల పేరు వినిపించకపోవడం… ఆయన తెలివికి, లాబీయింగ్‌కు నిదర్శనమని రాసుకొచ్చింది. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఊళ్లు విడిచి ఎక్కడో దాక్కున్న వైసీపీ యాక్టివిస్టులు కూడా జైలుపాలయ్యారు కానీ, వైసీపీ సోషల్ మీడియాకు బాధ్యత వహించిన సజ్జల భార్గవ్‌రెడ్డి మాత్రం సేఫ్‌గా చిల్ అవుతున్నారనీ.. అదంతా సజ్జలకు, కూటమి ప్రభుత్వానికి మధ్యనున్న లోగుట్టని చెబుతూ… ఏకంగా సజ్జలని కూటమికి జిగిరి దోస్త్‌ని చేస్తూ రాసుకొచ్చింది సదరు మీడియా. వైసీపీ సినిమాలో సజ్జలది ద్విపాత్రాభినయం అని.. అందులో ఒక పాత్ర జగన్‌కు నమ్మదగ్గ ఆంతరంగికుడు అయితే… మరో పాత్ర జగన్ జుట్టు కూటమి చేతిలో పెట్టే కట్టప్ప పాత్ర అని చెప్పుకొచ్చింది. అసలు వైసీపీ అనుకూల మీడియాకు సజ్జలతో గొడవేంటి? సజ్జలపై అనుమానం ఎందుకొచ్చింది? అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.
వైసీపీలో సజ్జల ప్రాబల్యం కొత్తేమీ కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ సజ్జలను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. పార్టీ ఓటమి తర్వాత కూడా సజ్జల ఆధిపత్యం కొనసాగింది. సజ్జలను మహాభారతంలోని శకునితో పోల్చుతూ, వైసీపీని అధోగతి పాలు చేశారనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. జగన్ అమరావతిని వ్యతిరేకిస్తున్నా, సజ్జల మాత్రం అమరావతికి మద్దతిస్తూ బహిరంగంగా మాట్లాడారు. జగన్ దీనిని ఖండించకపోవడం సజ్జల ఆధిపత్యాన్ని సూచిస్తోందని పరిశీలకులు అంటోంటే… విజయసాయిరెడ్డిని పక్కన పెట్టిన జగన్, ఇప్పుడు సజ్జలను కూడా దూరం పెడతారా అనే అనుమానం పార్టీ వర్గాల్లో నెలకొంది. ఏది ఏమైనా సజ్జల నంబర్-2 స్థానంలో ఉన్నంత వరకు వైసీపీలో ఈ గందరగోళం తప్పదని వైసీపీ అనుకూల మీడియానే కోడై కూస్తోంది.