Rajakiya Kakshalu : ఎన్నికల వరకే పరిమితమవ్వాల్సిన రాజకీయాలు.. అధికార కాంక్షలతో కూడిన ఒక విష వలయంలా మారుతున్నాయా? అధికారంలో ఉండే పార్టీలు శాశ్వతం కాదు.. కానీ ప్రభుత్వం శాశ్వతం అని రాజనీతిజ్ఙులు అరిచి చెప్పినా, రాజకీయ నాయకులు మాత్రం అధికారాన్ని తమ జేబులో శాశ్వత ఆస్తిగా మార్చుకోవాలనే కలలు కంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను రాజకీయంగా చితక్కొట్టాలనే కసి సహజమే అయినా… ఆ కసిని సాధించే మార్గాలే ఒక పార్టీని శిఖరానికి చేర్చడమా, లేక పాతాళానికి దించడమా అన్నది నిర్ణయిస్తాయి.
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు ప్రజల చేతిలో కత్తి లాంటివి. ఎవరిని ఎత్తాలో, ఎవరిని తొక్కాలో ప్రజలిష్టం. అది ఊహించడం ఎవరి తరం కాదు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు అనే విష బీజాన్ని మొలకెత్తిస్తే, ఐదేళ్ల తర్వాత అదే విషం తమ గొంతు కోస్తుందన్న సత్యాన్ని రాజకీయ నాయకులు ఎందుకు మరచిపోతున్నారో అర్థం కాదు? ఈ దిగజారుడు ఆటలో గెలుపు తాత్కాలికమేనని తెలిసినా, ఎందుకు వదలలేకపోతున్నారో అంతుపట్టదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయ నాటకం ఈ విష చక్రానికి అద్దం పడుతోంది. గత ఐదేళ్లలో అధికారంలో ఉన్నవారు ప్రత్యర్థులపై కేసుల వర్షం కురిపించి, జైళ్లను వారి రాజకీయ శిబిరాలుగా మార్చారు. ఇప్పుడు అధికారం మారిన వెంటనే, ఆనాడు బాధితులైనవారు, నేడు బాధకులుగా మారి, కొత్త కేసులతో ప్రతీకార దాహాన్ని తీర్చుకుంటున్నారన్న విమర్శ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
Rajakiya Kakshalu: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ రెడ్డి పాలనలో చంద్రబాబుని ఆధారాలు లేని కేసులో 53 రోజులు జైలులో ఉంచి ఆనందించారు. అయ్యన్న పాత్రుడు, అచ్చన్నాయుడు, కొల్లు రవీంద్ర, పట్టాభి, జేసీ ప్రభాకర్ ఇలా చాలా మంది టీడీపీ నేతలపై చెల్లని కేసులు పెట్టి.. కక్ష తీర్చుకున్నారు జగన్ రెడ్డి. ఇప్పుడు అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు జైళ్లకు క్యూ కడుతున్నారు. బెయిలు దొరక్కపోతే.. ఆస్పత్రి బెడ్ అయినా చాలు అనే దీనస్థితికి దిగజారారు. జగన్ ఆనాడు కాస్త వివేకం చూపి, క్రూరత్వాన్ని కట్టడి చేసి ఉంటే, ఈనాడు తన పార్టీ నేతలు ఈ దుర్గతి పాలయ్యేవారు కాదేమో అని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.
కానీ విచిత్రమేమిటంటే, వైసీపీ నేతల నోట “మళ్లీ అధికారంలోకి వస్తాం, అప్పుడు వంద రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాం” అనే బెదిరింపులు ఇంకా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత నుండి.. ఆ పార్టీ క్యాడర్, లీడర్ల వరకూ.. ఎవ్వరిలోనూ మార్పు రాకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. మరోవైపు నేడు వైసీపీ నేతల్ని వరుసబెట్టి జైలుకు పంపుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. వారి అవినీతిని, వారిపై చేస్తున్న ఆరోపణల్ని న్యాయస్థానాల్లో ఆధారాలతో సహా నిరూపించని పక్షంలో.. ప్రజల దృష్టిలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకునే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Bengaluru Techie: క్షణికావేశంలో భార్యను చంపేశాడు.. రాత్రంతా శవంతో మాట్లాడుతూ కూచున్నాడు!
Rajakiya Kakshalu: ఇక తెలంగాణలోనూ ఈ కక్షపూరిత రాజకీయ దుర్గంధం తక్కువేమీ కాదు. అసెంబ్లీ సాక్షిగా నిన్ని కేటీఆర్, రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన బురద యుద్ధం ప్రజల కళ్లముందు సజీవం. “మా నేతలపై తప్పుడు కేసులు” అని కేటీఆర్ ఆరోపిస్తే, “నీ హయాంలో నన్ను అక్రమంగా డీటెన్షన్ సెల్‌లో బంధించారు” అని రేవంత్ గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులను జైలుకు పంపి, అధికారంలో లేనప్పుడు విక్టిమ్ కార్డులు ప్లే చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం కేవలం నాయకుల భ్రమే అవుతుంది.
తమిళనాడులో జయలలిత, కరుణానిధుల మధ్య దశాబ్దాల క్రితం నడిచిన ఈ రివేంజ్ డ్రామా ఒక హెచ్చరిక కాదా? జయలలితను జుట్టు పట్టి ఈడ్చిన కరుణానిధి పాలన, కరుణానిధిని పంచ పట్టి లాగిన జయలలిత ప్రతీకారం… ఈ ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని గెలిచారా, లేక ఖననం చేశారా? చరిత్ర చెప్పే పాఠాలను తెలుగు రాష్ట్రాల నాయకులు వ్యూహాత్మకంగా విస్మరిస్తున్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది ఎవరికైనా.
అధికారం శాశ్వతం కాదు, ప్రభుత్వమే శాశ్వతం అన్న సత్యాన్ని నాయకులు గుండెల్లో ఎప్పుడు నింపుకుంటారో, అప్పుడే ఈ విష వలయం తెగిపోతుంది తప్ప.. లేకుంటే, ఈ రాజకీయ అరెస్టులు, కక్షపూరిత కేసులు ఒక అంతులేని వికృత క్రీడగా మారి.. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల విశ్వాసాన్ని కబలించివేస్తాయన్నది విజ్ఙులు, రాజకీయ మేథావులు చెప్తున్న మాట.

