Rajampet Inchar Jagan: బడి నుంచి రాజకీయ వొడికి చేరారు జగన్మోహన్ రాజు. విద్యాసంస్థల సంస్థల ద్వారా తనదైన గుర్తింపు తెచ్చుకున్న జగన్మోహన్ రాజు టీడీపీలో చేరి రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. నేడు రాజంపేటకు టీడీపీ ఇంచార్జ్‌గా జగన్మోహన్ రాజును నియమించారు సీఎం చంద్రబాబు. ఏడాదిన్నర్రకు పైగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. నిజానికి రాజంపేట ఇంచార్జ్ రగడ టీడీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురి చేసింది. రాజంపేట అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓటమి అనంతరం ఇంచార్జ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది. వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో, నేతల్ని ఏకతాటిపైకి తెచ్చి పార్టీని గాడిన పెట్టడానికి సమర్థుడైన నేతకు పగ్గాలు అప్పగించాలని తమ్ముళ్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. మెజార్టీ క్యాడర్ తాత్కాలిక ఇంచార్జ్‌గా ఉన్న చమర్తి జగన్మోహన్ రాజే ఇంచార్జ్‌గా రావాలని కోరుకున్నారు. క్యాడర్ మనోగతాన్ని సీఎం చంద్రబాబు గుర్తించినట్లున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికలో జగన్మోహన్ రాజు సామర్థ్యాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఇంచార్జ్ ఎపిసోడ్‌కు తెర దించుతూ రాజు వైపే మొగ్గు చూపారు.
Also Read: Telangana: మలుపులు తిరుగుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
నిదానమే ప్రధానం అన్న పెద్దల మాటలు జగన్మోహన్ రాజు ఫాలో అయ్యారా? జగన్మోహన్ రాజు విధేయత వల్లే పార్టీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపిందా? సైలెంట్‌గానే గోల్ రీచ్ అయ్యారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజు రాకతో రాజంపేట టీడీపీలో వర్గ విబేదాలకు చెక్ పడినట్లే అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. ఇక టార్గెట్ 2029 దిశగా జగన్మోహన్ రాజు అడుగులు ఉండబోతున్నాయంటూ చెబుతున్నారు. జగన్మోహన్రాజు నేతృత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీకి మైదుకూరులో పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుతూ ముందుకెళ్లాల్సిన సవాల్ ఇప్పుడు జగన్మోహన్ రాజు ముందుంది. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన జగన్ మోహన్ రాజు.. అదే జోష్‌తో రాజంపేటలోనూ చక్రం తిప్పుతారని తమ్ముళ్లు భావిస్తున్నారు. జగన్మోహన్ రాజు కూడా అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారట. ఈ విషయంలో అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్‌ల మార్గదర్శకత్వమే తనకు శ్రీరామ రక్ష అంటున్నారు జగన్మోహన్ రాజు. చూడాలి మరి.. రాజంపేటలో రాజకీయాల్లో రాజు రారాజుగా తన మార్క్ చూపిస్తారో లేదో.