Peddareddi

Peddareddi: డూ ఆర్‌ డై సిచ్యుయేషన్‌లో తాడిపత్రి పెద్దారెడ్డి

Peddareddi: రాష్ట్ర రాజకీయాల్లోనే ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ నియోజకవర్గంలో ఎప్పుడు చూసినా రాజకీయ వేడి తహతహలాడుతూ ఉంటుంది. అయితే గత ఎన్నికల సమయం నుంచి ఆ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేనున్నానంటూ భరోసా కల్పించే వారే కరువయ్యారు. దాంతో వైసీపీ అధినేత జగన్ దృష్టి మరొకరి వైపు వెళ్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇంతకూ ఆ నియోజకవర్గం ఏది అనుకుంటున్నారా? అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం.

తాడిపత్రి అంటేనే టక్కున గుర్తుకు వచ్చే పదం జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. గత వైసీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాడిపత్రిలో 20 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన జేసీ కుటుంబాన్ని కేసులు పెట్టించి ముప్పుతిప్పలు పెట్టించాడు. అయితే ఏకంగా జేసీ నివాసానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లి రావడం అప్పట్లో రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బలమైన జేసీ కుటుంబ సభ్యులైన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని సైతం జైలు పాలు చేశారు. అప్పటివరకు జేసీ వర్గం నుంచి ఎలాంటి హాని లేకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ నేతలు, కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి “ఏ పార్టీ వచ్చినా కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా” అన్న ఒక్క పిలుపుతో తాడిపత్రిలోకి జేసీ అడుగుపెట్టనివ్వలేదు. ఇప్పటికి దాదాపు ఒకటిన్నర సంవత్సరం అవుతున్నప్పటికీ తాడిపత్రిలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టలేదు. దీంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడిపత్రిలో మార్పు కోరుతున్నారన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లకపోవడంతో వైసీపీ శ్రేణులకు, కార్యక్రమాలకు పుల్ స్టాప్ పడుతుంది.

Also Read: US Tariffs Effect: ట్రంప్ సుంకాలతో లక్ష ఉద్యోగాలు పోతాయా?

దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కొనదుల రమేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా తాడిపత్రి నుంచి టికెట్ ఆశించే వారిలో మైనారిటీ నుంచి ఫయాజ్ భాష, ప్రజలలో మంచి పేరు ఉన్న రూపాయి డాక్టర్ చామలూరు అనిల్ కుమార్ రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి చూపు రమేష్ రెడ్డి వైపే ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని నాయకులతో పరస్పరం భేటీ అవుతూ, యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఇటీవల తాడిపత్రిలో జరిగిన చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమంలో అన్నీ తానై చూసుకున్నాడు. అంతేకాకుండా, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం “తాడిపత్రికి కొత్త వ్యక్తి వస్తున్నాడు, అంటే కదా శుభ పరిణామం.. కనీసం ఆయన తాడిపత్రి పరిశుభ్రత వైపు చూడాలి” అంటూ వ్యాఖ్యలు చేయడం పార్టీ అభ్యర్థి మార్పుపై ప్రజల్లోకి బలమైన సంకేతాలు వెల్లడయ్యాయి.

2024 ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమీకరణాల పేరుతో అభ్యర్థులను మార్చడంతో అధికారంలోకి రావడంలో పూర్తిగా విఫలమయ్యారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, దమ్ము కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబానికి మాత్రమే ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పటికీ కూడా డీ అంటే డీ కాలు దువ్వుతున్నారు. మరి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కాదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డికి అవకాశం కల్పిస్తే జేసీకి రూట్ క్లియర్ అన్న సంకేతాలు సైతం వినిపిస్తున్నాయి. మరి వేచి చూడాలి, తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అండగా నిలబడతారా? ఆయన నియోజకవర్గంలో అడుగు పెడతారా? లేకపోతే సమన్వయకర్త మారుస్తారా? అన్న విషయంపై వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *