Pedda Mystery Family: రెండు నెలలకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపి, గడ్డం కూడా పెరగని కులాసా లుక్‌తో బయటకొచ్చిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. మీడియా సమావేశంలో డ్రామాటిక్‌గా వాపోయారు. జైల్లో తనను ఉగ్రవాదిలా చూశారని, సీసీ కెమెరాలతో నిఘా పెట్టారని, ఎవరూ తనతో మాట్లాడలేదని. కోర్టు ఆదేశాల వరకూ సాధారణ సౌకర్యాలూ ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, జైల్లో సీసీ కెమెరాలు సాధారణమే కదా? అసలు బెయిల్ షరతుల ప్రకారం కేసు గురించి మాట్లాడకూడదు, కానీ మిథున్ మాత్రం బహిరంగంగా అదే మాట్లాడారు. ఈ చట్టాలన్నా, కోర్టులన్నా వారికి అంత ధైర్యం అనుకోవాలి జనం. లిక్కర్ స్కామ్‌లో జగన్ కోసం లంచాలు వసూలు చేసి, ప్రతి శుక్రవారం లెక్కలు చెప్పినట్లు వైసీపీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటారు. అయినా, “స్కామ్ జరగలేదు, తప్పుడు కేసు” అని మిథున్ వాదిస్తున్నారు.
టీడీపీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలు వేధింపులకు గురి చేసినా జగన్‌ను, వైసీపీని విడిచిపెట్టి వెళ్లం. ఇదీ మిధున్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ స్టేట్మెంట్. అది కాసేపు పక్కన పెడితే… చోటా మోటా నాయకులను జైలుకు వెళ్లి కలిసిన జగన్.. 71 రోజులు జైల్లో ఉన్న మిధున్ రెడ్డి పరామర్శకు వెళ్లలేదు ఎందుకు? లిక్కర్‌లో జగన్‌కు తెలియకుండా మిథున్ రెడ్డి ఏదైనా సొంత వ్యవహారం నడిపించారా? లేక వేరే కారణాలు ఉన్నాయా? అన్న ప్రశ్నలు ఒక కోణం నుండి వినిపిస్తుంటే.. పెద్దిరెడ్డికి, జగన్‌కు మధ్య విభేదాలు ఉన్నాయా? బీజేపీకి పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరవుతోందా? అన్న ప్రచారం మరో కోణం నుండి జరుగుతోంది.
Also Read: Amaravati: రాజధాని అమరావతిలో మలేసియా బృందం పర్యటన
అసలు విషయమేమిటంటే, 71 రోజులు జైల్లో ఉన్న మిథున్‌ను జగన్ ఎందుకు కలవలేదు? ఇతర చిన్నా చితకా నాయకులను జైలుకు వెళ్లి కలిసిన జగన్, మిథున్ విషయంలో మాత్రం దూరం పాటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లిక్కర్ స్కామ్‌లో జగన్‌కు తెలియకుండా మిథున్ ఏదైనా తఖరారు చేశారా? లేక వ్యూహాత్మకంగానే దూరం ఉంచారా? ఈ ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్లోనూ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. పెద్దిరెడ్డి మాటలు ఈ సందేహాలకు మరింత ఊతమిచ్చాయి. “ఎన్ని కేసులు పెట్టినా జగన్‌ను విడిచిపెట్టేది లేదు” అని ఆయన నొక్కి చెప్పడం దేనికి సంకేతం? మిథున్ కుటుంబం అసంతృప్తిలో ఉందనే ప్రచారాన్ని కొట్టిపారేయడానికా? లేక జగన్‌తో విభేదాలున్నాయనే ఊహాగానాలను అడ్డుకోవడానికా? ఈ విషయంలో స్పష్టత లేకపోవడం రాజకీయంగా కొత్త రహస్యాలకు తెరలేపింది. మిథున్‌కు జైలు శిక్ష అనివార్యమైతే, జగన్‌తో సంబంధాలు ఎలా సాగుతాయి? పెద్దిరెడ్డి ఫ్యామిలీతో బీజేపీ ఆడించే గేమ్ ఎలా ఉండబోతోంది? ఈ స్కామ్ డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!