Pawan Route Map for Vijay TVK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఒంటరిగా పోటీ చేయకుండా ఎన్డీయే కూటమితో జట్టు కట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన విజయ్‌తో ఫోన్లో చర్చించారని సమాచారం. గతంలో పీఆర్పీ, జనసేన అనుభవాలను పంచుకుంటూ, ఒంటరి పోరు సవాళ్లను వివరించినట్లు చెబుతున్నారు. కూటమితో కలిస్తే డీఎంకేను సమర్థంగా ఎదుర్కొని, ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పవన్ సలహా ఇచ్చారని అంటున్నారు.
సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీ తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అధికార డీఎంకే నిర్లక్ష్యం వల్లే జరిగిందని బీజేపీ నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. డీఎంకే మాత్రం విజయ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించింది. ఈ ఘటన తర్వాత విజయ్ ఒంటరి పోరు నిర్ణయంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ త్రిసభ్య కమిటీని నియమించడం టీవీకేకి నైతిక విజయంగా నిలిచింది. ఈ తీర్పు డీఎంకేకు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బగా మారింది. అయితే.. ఈ దర్యాప్తు.. ఎప్పటికి ముగుస్తుందన్న విషయంపై సుప్రీంకోర్టు ఎలాంటి గడువు విధించలేదు. ఇది కూడా ఒక రకంగా విజయ్‌కు సానుకూల అంశమే అన్న చర్చ జరుగుతోంది.
Also Read: Viral News: 150 ఏండ్ల క్రితమే లిఫ్ట్‌లను వాడిన నిజాం నవాబులు
తొక్కిసలాట ఘటనతో టీవీకే ఒక్కసారిగా ఢీలా పడింది. ఆ తర్వాత ఏడీఎంకే-బీజేపీ కూటమి చక్రం తిప్పడం మొదలు పెట్టింది. మొదటగా అన్నామలై, కుష్బూ వంటి బీజేపీ నేతలు దళపతికి మద్ధతు ప్రకటించారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆ వెంటనే ఏడీఎంకే నేత పళని స్వామి దళపతిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా అన్నాడీఎంకే సభలో టీవీకే జెండాలు కనిపించడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు తొక్కిసలాట కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లడం నిజంగా విజయ్‌కి గుడ్ న్యూస్. ఇక బీజేపీ ఎలా ఆడించాలనుకుంటే అలా ఆడిస్తుందన్న వాదన వినబడుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ ముందున్న మార్గం.. పట్టుదల వీడి కూటమితో జట్టు కట్టడమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తానికి విజయ్.. ఎన్డీఏ దారిలోకి వస్తున్నారు అనేదానికన్నా… రప్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.