Pawan on vote chori: ఇటీవల రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్, బీజేపీతో కలిసిపోయి పనిచేస్తోందని.. ఈవీఎంల విషయంలో అనేక మోసాలు జరిగాయని ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ ఈసీ ఆధారాలు అడిగితే సమాధానం లేదు. ఆధారాలుంటే కోర్టుల ద్వారా పోరాడొచ్చు. కానీ రాహుల్ మాత్రం ఆరోపణలు చేయడం మాత్రమే మా పని, వాటిని రుజువు చేయడం తమ పని కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే రాహుల్ పోరాటాన్ని పూర్తిగా కొట్టిపడేయలేం. అనుమానించడం, ఆరోపించడం కూడా ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యానికి మేలే చేస్తుంది. రాహుల్ ఆ పనైనా చేస్తున్నారు. కానీ ఏపీలో ప్రతిపక్ష హోదా కోసం అలిగి కూర్చున్న జగన్ మోహన్ రెడ్డి మాత్రం… తన పని కూడా రాహులే చేయాలంటున్నారు. రాహుల్ తన ఆరోపణల్లో కర్ణాటక, యూపీ, మధ్య ప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికల అక్రమాలను ప్రశ్నించారు కానీ.. ఏపీలో 151 నుండి 11 సీట్లకు పడిపోయిన తమ గురించి ఎందుకు మాట్లాడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా రాహుల్, చంద్రబాబుతో చేతులు కలిపారంటూ తన భయాన్ని, మానసిక రుగ్మతని బయటపెట్టుకున్నారు. మరోవైపు రాహుల్ చేసినట్లే.. జగన్ కూడా ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఏపీలో ఈవీఎంల అక్రమాలను ఆధారాలతో బయటపెట్టొచ్చు కదా అని వైసీపీ క్యాడర్ ఆశపడుతున్నారు. కానీ జగన్ వద్ద సరుకు లేదు. దీనిపై ఏపీ కాంగ్రెస్ జగన్‌కి బాగానే గడ్డి పెట్టింది. నువ్వు బెంగళూరు ప్యాలెస్‌లో పడుకుని, తాడేపల్లి ప్యాలెస్‌లో పబ్‌జీ ఆడుకుంటూ ఉంటే.. నీ కోసం రాహుల్ మాట్లాడాలా అంటూ ఘాటుగా స్పందించింది.
Also Read: Free Bus Scheme: తెలుగు రాష్టాల్లో ఉచిత బస్సు.. ఈ తేడాలు గమనించారా?
రాహుల్, జగన్‌ల వ్యవహారం ఇలా ఉంటే… తాజా ఇద్దరికీ కలిపి కంబైండ్‌గా కౌంటర్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన పవన్ విపక్షాల ఓట్ల చోరీ ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణల వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గెలిస్తే ఎన్నికలు న్యాయంగా జరిగాయని, ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్, బ్యాలెట్ రిగ్గింగ్ అని ఆరోపించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈవీఎంలపై రాహుల్ గాంధీ, జగన్ రెడ్డిల ఆరోపణలను తిప్పికొడుతూ, ఈసీపై నేరుగా దాడి చేసే ఈ ప్రచారం దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలో భాగమని పవన్ ఘాటుగా విమర్శించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థ అని, దానిపై నమ్మకమే ప్రజాస్వామ్య మూల స్తంభమని పవన్ గుర్తుచేశారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయకుండా ప్రజా తీర్పును గౌరవించామని, కానీ 2024లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైసీపీ, ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలతో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ విదేశాల్లో భారత్‌పై వ్యతిరేక ప్రకటనలు చేస్తూ, ఓ అమెరికా వ్యాపారవేత్తతో సంబంధాలు నిర్వహిస్తున్నారన్న బీజేపీ ఆరోపణలను పవన్ పరోక్షంగా ప్రస్తావించారు. ఇక ఏపీలో 2019-2024 మధ్య బ్రిటిష్‌వారి డివైడ్ అండ్ రూల్ పాలనను తలపించే చీకటి రోజులు కొనసాగాయని, కానీ కూటమి ప్రభుత్వం యునైటెడ్ అండ్ రూల్ స్ఫూర్తితో కలిసి పాలన సాగిస్తోందన్నారు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ.. తాము గెలిస్తే అంతా బాగుందని, ఓడితే ఈవీఎంలే ఓడించాయని గగ్గోలు పెట్టే నేతల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం.