Operation Clean Politics: కడప మహానాడులో చంద్రబాబు ‘ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్’ పిలుపు రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది! అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ, ఆర్థిక ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే మద్యం, మైనింగ్ అక్రమాల్లో వైసీపీ నేతలు, వారికి సహకరించిన పలువురు అధికారులు జైలు పాలవడంతో వైసీపీ అత్యంత కలవరపడుతోంది. ఇప్పుడు చంద్రబాబు ప్రకటించిన ఈ ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ తుఫాను తెస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రానున్న రోజుల్లో అరెస్టులు, కేసులు మరింత తీవ్రం కానున్నాయా? గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై కూటమి ప్రభుత్వం దూకుడు మరో స్థాయికి చేరే అవకాశం ఉందా? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో జరుగుతోన్న ఇంట్రస్టింగ్ డిష్కషన్.
కడప మహానాడు మహాసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆయన ప్రసంగంలో ప్యాలస్, ఎస్టేట్ పాలిటిక్స్ అంటూ చేసిన కామెంట్స్ ఎవర్ని ఉద్దేశించినవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైకుంఠపాళి మనకొద్దన్న చంద్రబాబు.. అధికారంలోకి ఎక్కడం, దిగడం.. తద్వారా రాష్ట్రం వెనకబడిపోతుండటం, అధికారం అయోగ్యుల చేతికి చిక్కి అరాచకాలు పెరిగిపోతుండటం వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా.. రాష్ట్రంలో మరోసారి కూడా వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, మళ్లీ వైసీపీని లేవకుండా కొడతామని స్పష్టమైన సంకేతాలను ప్రజల్లోకి పంపారు. “వైనాట్ గొడ్డలిపోటు” అన్నది తమ విధానం కాదన్న చంద్రబాబు… 2019 ఎన్నికలకు ముందు బాబాయిని హత్య చేసిన వారు, ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్న తనని కూడా వివేకాది గుండెపోటని ఎలా నమ్మించారో, ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టించారో, ఆఖరి ఆ రక్తపు మరకలు తన చొక్కాకు పూయాలని ఎలా కుట్రలు చేశారో గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో క్రిమినల్స్ పెరిగిపోయారని, రాజకీయం ముసుగులో వస్తున్న క్రిమినల్స్‌తో ఏం రాజకీయం చేయాలంటూ ఇటీవల కాలంలో తరచూ ప్రస్తావిస్తూ వస్తున్న చంద్రబాబు… ఇప్పుడు “ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్” అంటూ ప్రకటించడంతో అసలేం జరగబోతోందన్న చర్చ ఊపందుకుంది.
Also Read: Mahanadu Committees: మహానాడు ఎఫెక్ట్.. లోకేష్ టీమ్ రివీల్?
Operation Clean Politics: మహానాడు మూడవ రోజు సభలో… గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను లేవనెత్తిన చంద్రబాబు.. ‘ప్యాలెస్, ఎస్టేట్ పాలిటిక్స్’ అంటూ మాజీ నేతలపై పరోక్షంగా విమర్శలు సంధించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత వైసీపీ హయాంలో రెవెన్యూ, మైనింగ్, అటవీ, దేవాదాయ, మునిసిపల్ శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతిని జరిగిందని ఆరోపణలున్నాయి. ఇప్పటికే మద్యం, మైనింగ్ రంగాల్లో అక్రమాలకు పాల్పడిన కొందరు అధికారులు, నేతలు జైలు పాలయ్యారు. కూటమి ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పక్కా ఆధారాలతో కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు సంస్థలు విచారణలో అడుగుతోన్న ప్రశ్నలకు నిందితులు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజకీయాల ముసుగులో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అరెస్టులతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, కక్ష సాధింపు చర్యలంటూ విపక్ష వైసీపీ ప్రచారం చేసుకునే ప్రమాదం ఉందని చంద్రబాబు భావిస్తూ వచ్చారని, కానీ ఇప్పుడు తన ధోరణి మార్చుకుని, కేసులపై ముందుకే వెళ్లాలని నిర్ణయించారని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ప్రభుత్వ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలకే విడిచిపెట్టాలని, ఆధారాలుంటే బిగ్‌బాస్‌ని అయినా జైలుకు పంపాల్సిందేనని చంద్రబాబు ఆదేశాలిచ్చినట్లు అంతర్గత వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా.. చంద్రబాబు చేసిన “ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్” వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, వైసీపీ నేతలను కలవరపెట్టేలా ఉన్నాయనడంలో సందేహమే లేదు.