NH 163 The Deadly Highway: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్ బస్సును ఢీకొట్టి బోల్తాపడటంతో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగమే ప్రధాన కారణమైనప్పటికీ, ఇరుకైన రోడ్డు, ప్రమాదకరమైన గుంతలు, అనేక చోట్ల మలుపులు, బాగు చేయకుండా ఏళ్లతరబడి పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వాల అలసత్వం కూడా ఈ విషాదానికి దోహం చేశాయని స్థానికులు ఆగ్రహంగా చెబుతున్నారు.
హైదరాబాద్-బీజాపూర్ NH-163 రహదారి వాణిజ్యం, వ్యవసాయం, పౌర ప్రయాణాలకు కీలకంగా ఉంది. నిత్యం ఈ రహదారి వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ చాలాకాలంగా ప్రమాదాల భయం ఈ మార్గాన్ని చుట్టుముట్టింది. గతేడాది డిసెంబర్లో ఆలూరు వద్ద లారీ కూరగాయల వ్యాపారులపై దూసుకెళ్లి 6 మంది మరణించడం జరిగింది. అదే విధంగా గతేడాది సెప్టెంబర్లో ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 6 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ ఏడాది జూన్లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో గుంతలో పడి వాహనం బోల్తా కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. నేషనల్ హైవేకి రెండు వైపులా కూరగాయల మార్కెట్లు, నిత్యం వాహనాలు రద్దీ, గుంతలు, మలుపులు, రహదారి వెంబడి ప్రమాద హెచ్చరికలు, మలుపులను సూచించే సైన్ బోర్డులు లేకపోవడం పాటూ, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ కంట్రోల్ వంటి సిగ్నలింగ్ వ్యవస్థ లేకపోవడం ప్రమాదాల సంఖ్యను, వాటి తీవ్రతను పెంచుతోంది. మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు వందలాది మంది ప్రాణాలు ఈ ఇరుకు రోడ్డుకు బలయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: Airport: తెలంగాణలో మరో ఎయిర్ పోర్ట్.. 700 ఎకరాలు సేకరించమని ప్రభుత్వం ఆర్డర్
ఈ సమస్యకు పరిష్కార… 46 కి.మీ మేర ఎన్హెచ్-163ని నాలుగు లేన్లుగా విస్తరించడం. గత ప్రభుత్వ హయాంలోనే ఇందుకు రూ.920 కోట్లు మంజూరయ్యాయి. కానీ కొందరు పర్యావరణ ప్రేమికులు ఎన్జీటీలో కేసు వేసి, 950 చెట్ల నష్టం కలుగుతుందంటూ పనులకు అడ్డుపడ్డారు. మరోవైపు ప్రమాదాల పట్ల స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్థానికుల ఆందోళనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణ ప్రేమికులతో అధికారులు చర్చలు జరిపి, 150 చెట్లను రహదారికి ఇరువైపులా పొలాల్లో నాటడం, మిగతావి మార్గం మధ్యలో ఉంచే విధంగా విస్తరణ ప్రణాళిక రూపొందించారు. దీంతో సంతృప్తి చెందిన పర్యావరణవాదులు మొన్న అక్టోబర్ 31న ఎన్జీటీలో తమ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే మొయినాబాద్-చేవెళ్ల మార్గంలో విస్తరణ పనులు మొదలయ్యాయి. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. విస్తరణ పనులు పూర్తయితే చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు ప్రాంతాలకు సురక్షిత రవాణాకు మార్గం సుగమం అయ్యి, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. న్యాయ అడ్డంకులు తొలగడంతో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.

