MLA Kamineni Srinivas: డెబ్బై ఏళ్ల ముసలాయన. సీఎం చంద్రబాబు విషయంలో 54 ఏళ్ల మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే నిత్యం చేస్తున్న వ్యాఖ్య ఇది. కానీ నాడు సీఎంగా ఉన్నా, నేడు ప్రతిపక్ష నేతగా ఉన్నా.. వర్క్‌లో చంద్రబాబు నాయుడు స్పీడును జగన్ రెడ్డి ఏనాడు అందుకోలేకపోయాడు. సీఎం చంద్రబాబు ఒక్కరే కాదు. ఏడు పదుల వయసులోనూ పాలిటిక్స్ అదరగొడుతూ, ప్రత్యర్థులను బెదరగొడుతున్న నేతలు కూటమిలో చాలా మందే ఉన్నారు. కూటమి సమీకరణాల్లో పోటీ చేయక కొందరు, పదవులు లేక కొందరు సైలెంట్ అయ్యారు కానీ.. గెలిచిన సీనియర్‌లు మాత్రం తగ్గేలే అంటున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.
ఏడు పదుల వయసు. ఓ వైపు వర్షం. వందల సంఖ్యలో వాహనాలు. కార్యకర్తల కేరింతలు. బుధవారం జరిగిన పంద్రాగష్టు సంబరాల్లో యువతతో పోటీ పడి బుల్లెట్‌పై దూసుకెళ్లారు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశానుసారం 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా వర్షంలోనూ ఉరిమే ఉత్సాహంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారాయన. జాతీయ జెండాలతో కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా నుంచి కైకలూరు మార్కెట్ యార్డు వరకు బైక్ నడిపి యువతను, క్యాడర్‌ను ఉత్సాహ పరిచారు. ప్రతి దేశ పౌరుడి ఇంటిపైన మన జాతీయ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు కామినేని శ్రీనివాస్.
Also Read: Pulivendulalo Shivangulu: సీమ శివంగుల ధాటికి వైసీపీ విలవిల
ఇక అదే రోజు నియోజకవర్గంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ తొలి విడుత నిధులు జమ చేసిన తరుణంలో నియోజకవర్గ రైతులు కైకలూరులో 300 ట్రాక్టర్లతో కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలోనూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహ పరిచారు. ఏడు పదుల వయసులోనూ ఆయనలోని జోష్ ఏంటో అర్థం కాక.. క్యాడరు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గత ప్రభుత్వంలో దావోస్‌కి ఎందుకెళ్లలేదయ్యా అంటే.. చలిగా ఉంటుందని వెళ్లలేదంటూ.. అప్పట్లో ఓ యువ వైసీపీ మంత్రి సెలవివ్వడం చూశాం. నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సహా సీనియర్ నాయకులు జూనియర్లకు సవాల్ విసురుతూ.. ఎండా, వాన లెక్క చేయకుండా ప్రజల్లో దూసుకెళ్తున్నారు. ప్రజా సేవ చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి ఉండాలే కానీ.. వయసు అడ్డురాదని నిరూపిస్తున్నారు.