Madakasira Toli Adugu: రాయలసీమ ప్రాంతం నుండి రాజకీయాల్లోకి వచ్చిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెస్ రాజు. టీడీపీలో ఆయనకు ఫైర్ బ్రాండ్‌గా పేరుంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెస్ రాజు… ఎమ్మార్పీఎస్ ఉద్యమ నాయకుడిగా తన ప్రజా ప్రస్థానం ప్రారంభించారు. 2018లో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్, టీడీపీలో మరో కీలక నాయకుడు పెద్ది రామారావుల సపోర్ట్ అండ్ గైడెన్స్‌లో రాజకీయాల్లో రాటుదేలారని చెబుతారు. వైసీపీ హయాంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం గట్టి వాయిస్ వినిపించారు. అనతి కాలంలోనే టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా పదవి దక్కించుకున్నారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు ఎమ్మెస్ రాజు. ఆయన పోరాటాలు, వైసీపీని ఎదుర్కొన్న విధానం చంద్రబాబు, లోకేష్‌ల కళ్లలో పడటం, రాజు పోరాటాలు గుర్తించి 2024లో టికెట్ కన్ఫామ్ చేయడం జరిగిపోయింది. టికెట్ కన్ఫామ్ అయినా.. పోటీ ఎక్కడ చేయాలన్నది ఒక్క పట్టాన తేలలేదు.
బాపట్ల నుంచి ఎంపీగా బరిలో దింపాలని పార్టీ అధిష్టానం మొదట ఆలోచించింది. అప్పటి సమీకరణాల దృష్ట్యా ఎట్టకేలకు ఎన్నికలకు 18 రోజుల ముందు మడకశిర టీడీపీ అభ్యర్థిగా బీఫామ్ అందుకుని బరిలో నిలిచారు ఎమ్మెస్ రాజు. ఆయనది సొంత నియోజకవర్గం సింగనమల. కానీ మడకశిరలో పోటీ చేసి, కేవలం 18 రోజుల గడువులోనే పట్టు సాధించి, గెలుపు బావుటా ఎగుర వేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండమల తిప్పేస్వామి సహకారంతో.. వైసీపీ ప్రత్యర్థి అయిన ఈర లక్కప్పపై 351 ఓట్ల మెజార్టీతో గెలిచారు ఎమ్మెస్ రాజు. ఈ రోజు మడకశిరలో టీడీపీ సభ్యత్వాలలో కానీ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కానీ, రాష్ట్రంలో టాప్ 5లో మడకశిరని నిలిపారు. గతంలో మడకశిర అంటేనే వర్గపోరుకు పెట్టింది పేరు. ఈ రోజు నియోజకవర్గంలో పార్టీని బలపరచి, తిప్పేస్వామితో కలిసి ముందుకెళ్తూ… మడకశిరలో ఎదురులేని శక్తిగా టీడీపీని నిలబెట్టారు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.
Also Read: PM Kisan yojana: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధులు వచ్చేది ఆరోజే!
ప్రజాభిప్రాయాన్ని బట్టి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే రాజు సేఫ్ జోన్‌లో ఉన్నారనే చెప్పాలి. ఈ యువ ఎమ్మెల్యే నియోజకవర్గ యువతకు పరిశ్రమలు తీసుకురావడంలో, ఉద్యోగాల కల్పనలో తన మార్క్ కనబరుస్తున్నారు. ఏడాదిలోనే నియోజకవర్గానికి గార్మెంట్స్, సోలార్ పరిశ్రమల్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన స్కూళ్ల ఆధునికీకరణ పనులు, నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రితో.. విద్య, వైద్యంలో కూడా ఆయనకు బెస్ట్ మార్క్సే పడ్డాయి. కొత్త సబ్‌స్టేషన్లను ప్రారంభించి, ట్రాన్స్‌ఫార్మర్లని అందించి రైతాంగానికి మేలు చేశారు. గ్రామాలలో తాగునీటి కోసం బోర్లు వేయించారు. వక్క రైతులకు వరంగా నియోజకవర్గంలో 5 ఎకరాల్లో వక్క మార్కెట్‌కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా త్వరలోనే శంకుస్థాపన చేయించనున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, మౌళిక వసతులపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు, ముడుపులు, కమీషన్లు లేని అవినీతి రహిత పాలన అందించాలన్న ఎమ్మెల్యే ప్రయత్నం ఫలితాలను చూపెడుతోంది. అయితే కర్ణాటక లిక్కర్ సమస్య మడకశిర నియోజకవర్గానికే సవాల్‌గా మారుతోంది. జాబ్ మేళాలతో యువతకు చేయూత అందిస్తున్నా… విద్యావంతులైన యువత స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఎదురుచూస్తోంది. బాలికలకు డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల కోసం డిమాండ్లు వినిపిస్తోంటే.. కొత్త పింఛన్ల మంజూరులో వృద్ధులు, వితంతువుల నుండి కొంత వ్యతిరేకత నియోజకవర్గంలో వ్యక్తమవుతోంది. ఇలా కొన్ని సమస్యలున్నా మొత్తానికి ఏడాది పాలనలో మడకశిర ఎమ్మెల్యే గ్రాఫ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించే దూసుకెళ్తోందని చెప్పొచ్చు.